Kashmir Encounter: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు.. అల్మారాలో దాక్కున్న టెర్రరిస్టుల హతం!

4 Terrorists Killed In J and K Hid In Bunker With Entry From Fake Cupboard
  • కుల్గామ్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదుల హతం
  • చిన్నిగమ్ ఫ్రిసాల్ ప్రాంతంలో కప్‌బోర్డు వెనకున్న రహస్య బంకర్‌లో దాక్కున్న ఉగ్రవాదుల హతం
  • అమరులైన ఇద్దరు జవాన్లు
కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో శనివారం నలుగురు హిజ్బుల్ ఉగ్రవాదులు హతమయ్యారు. చిన్నిగమ్ ఫ్రిసాల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో దాక్కున్న వారిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇంట్లోని కప్‌‌బోర్డు వెనక భాగంలో ఉగ్రవాదులు దాక్కున్నారని భద్రతా దళాలు తెలిపాయి. కప్‌బోర్డులోపలి నుంచి బంకర్‌లోకి రహస్య మార్గం గుర్తించామని పేర్కొన్నాయి. ఉగ్రవాదులకు స్థానికుల సహాయసహకారాలు అందుతున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు భారత ఆర్మీ సైనికులు కూడా అమరులయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం ఆరుగురు హిజ్బుల్ ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు భద్రతా దళాలు పేర్కొన్నాయి. 

‘‘మోడెర్గామ్‌లో జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా ఓ సైనికుడు అమరుడయ్యాడు. కుల్గామ్‌లోని చిన్నిగామ్ ప్రాంతంలో జరిగిన రెండో ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో సైనికుడు కన్నుమూశాడు’’ అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వీకే బిర్డీ పేర్కొన్నారు. ఉగ్రవాదులందరూ హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన వారేనని, మరణించిన వారిలో ఒకరు స్థానిక కమాండర్ అని కూడా పేర్కొన్నారు. 

మోడెర్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పారా కమాండో లాన్స్ నాయక్ ప్రదీప్ నయన్ మృతి చెందగా చిన్నీగమ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 1 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన హవాల్దార్ రాజ్‌ కుమార్ అమరులయ్యారు. 

కాగా, అమర్‌నాథ్ యాత్ర దృష్ట్యా తనిఖీలు మరింత కట్టుదిట్టం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లు హైవేకు దూరంగా జరిగాయన్నారు. ఉగ్రవాదుల విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉంటున్నామని, ఫలితంగా ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా హతమవుతున్నారని భద్రతా దళాలు పేర్కొన్నాయి.
Kashmir Encounter
Jammu And Kashmir

More Telugu News