Delhi Woman: వీధి గొడవలో కాల్పులు.. బంగ్లా పైనుంచి చూస్తున్న మహిళకు తగిలిన బుల్లెట్

Delhi Woman Watching Group Fighting from Rooftop Shot at Accidentally
  • ఢిల్లీలోని దయాళ్ పూర్ లో ఘటన
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • ఇద్దరి అరెస్టు.. పరారీలో కాల్పులు జరిపిన యువకుడు
వీధిలో గొడవ జరుగుతుంటే ఓ మహిళ బంగ్లా పైనుంచి చూసింది.. కింద కొట్లాడుకుంటున్న యువకులలో ఒకడు తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ గురితప్పి బంగ్లాపై ఉన్న మహిళకు తాకింది. నార్త్ ఢిల్లీలోని దయాళ్ పూర్ లో శనివారం చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని బ్రిజ్ పురికి చెందిన హశీం, బబ్లూల మధ్య జరిగిందీ గొడవ. హశీం ఇటీవల బబ్లూకు 17 వేలు అప్పు ఇచ్చాడు. తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న బబ్లూ శనివారం దయాళ్ పూర్ లో హశీంకు తారసపడ్డాడు. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని అక్కడే గట్టిగా నిలదీశాడు. ఇది కాస్తా ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఇద్దరూ గొడవపడుతుండగా బబ్లూ అనుచరులు కమ్రూల్, సుహేల్, సమ్రూన్ అక్కడికి చేరుకున్నారు. నలుగురూ కలిసి హశీంపై దాడికి దిగారు.

వీధిలో అరుపులు వినిపించడంతో ఏం జరుగుతోందని పక్కనే ఉన్న బిల్డింగ్ పైనుంచి ఓ మహిళ (48) తొంగిచూసింది. ఇంతలో కోపం పట్టలేక కమ్రూల్ తన దగ్గరున్న తుపాకీ తీసి హశీంపై కాల్పులు జరపగా.. బుల్లెట్ మిస్ ఫైర్ అయి నేరుగా మహిళను తాకింది. దీంతో కుప్పకూలిన మహిళను ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన జీటీబీ ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన తర్వాత కమ్రూల్ మిగతా వారితో కలిసి అక్కడి నుంచి పారిపోయారు. హశీం ఫోన్ కాల్ తో అక్కడికి చేరుకున్న పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. బబ్లూతో పాటు మరో యువకుడిని అరెస్టు చేశామని, కాల్పులు జరిపిన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుల ఇళ్లల్లో సోదా చేయగా.. ఓ నాటు తుపాకీ దొరికిందని వివరించారు. కాల్పుల్లో గాయపడిన మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.
 



Delhi Woman
Bullet
Firing
Group Fighting
North Delhi

More Telugu News