Joe Biden: అధ్యక్ష బరిలో ఉండేది నేనే.. గెలిచేదీ నేనే: జో బైడెన్

Joe Biden Invokes Lord Almighty Amid Calls To End Reelection Bid
  • అమెరికా అధ్యక్ష ఎన్నికలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన ప్రెసిడెంట్
  • తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, ఏ పరీక్షలూ అవసరంలేదని వ్యాఖ్య
  • అధ్యక్ష పదవికి తనకంటే అర్హులు ఎవరూ లేరన్న బైడెన్
అమెరికా అధ్యక్ష బరిలో నుంచి తప్పుకునేదే లేదని ప్రస్తుత ప్రెసిడెంట్, డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా తనకంటే మెరుగైన అభ్యర్థి ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. దేవుడు దిగి వచ్చి చెబితే తప్ప పోటీ నుంచి తప్పుకోబోనని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేదీ తానే.. ట్రంప్ ను మళ్లీ ఓడించేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం (అమెరికా కాలమానం) ఏబీసీ న్యూస్ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో బైడెన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2020 ఎన్నికల సమయంలోనూ తాను ఓడిపోతానని ప్రచారం జరిగిందని గుర్తుచేశారు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ను ఓడించి అధ్యక్ష బాధ్యతలను చేపట్టానని, ఇప్పుడు కూడా మరోసారి ట్రంప్ పై గెలుస్తానని చెప్పారు. మరో నాలుగేళ్ల పాటు అమెరికన్లకు సేవ చేసే సామర్థ్యం తనకు ఉందని వివరించారు.

తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని, తన జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యంపై రిపబ్లికన్లు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. మానసికంగా, శారీరకంగా తాను ఫిట్ గా ఉన్నానని తేల్చి చెప్పారు. తనకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరంలేదన్నారు. రిపబ్లికన్ల ఆరోపణల నేపథ్యంలో బైడెన్ ఆరోగ్యంపై కొంతమంది ప్రజల్లో అనుమానం రేకెత్తిందని యాంకర్ చెబుతూ.. అలాంటి వారి సందేహాలను తొలగించేందుకు ప్రైవేటుగా వైద్య పరీక్షలు చేయించుకుని, ఫలితాలను ప్రజల ముందు ఉంచే ఆలోచన ఉందా అని అడిగారు. అయితే, అధ్యక్షుడిగా తీరిక లేని పనులతో ప్రతీరోజూ తనకు తానే టెస్టులు పెట్టుకుంటున్నానని, తనకు మరే ఇతర పరీక్షలూ అవసరంలేదని వివరించారు.

రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన తొలి డిబేట్ లో తడబడడంపై బైడెన్ స్పందించారు. అదొక పీడకల అని, నిద్రలేమి, టైట్ షెడ్యూల్ కారణంగా చాలా అలసిపోవడం వల్ల డిబేట్ లో సరిగా పార్టిసిపేట్ చేయలేదని తెలిపారు. ఓవైపు డిబేట్ జరుగుతుండగానే నిద్ర ముంచుకొచ్చిందని, అందుకే ఇకపై రాత్రి 8 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలను చేయొద్దని నిర్ణయించుకున్నట్లు వివరించారు. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటూ సొంతపార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారన్న ప్రచారంపై స్పందిస్తూ.. పార్టీ సీనియర్ నేతలు ఎవరూ తనతో నేరుగా ఆ విషయాన్ని ప్రస్తావించలేదని బైడెన్ స్పష్టం చేశారు. అధ్యక్ష బాధ్యతల నిర్వహణకు తనకంటే మెరుగైన అభ్యర్థి లేరని కుండబద్దలు కొట్టారు. మరో నాలుగేళ్ల పాటు అమెరికన్లకు సేవలందించే శక్తి, సామర్థ్యాలు తనకున్నాయని వివరించారు.
Joe Biden
America
President Elections
Democrates
Donald Trump

More Telugu News