Hooch Victims: కల్తీ సారా తాగి చనిపోతే రూ.10 లక్షల పరిహారమా? వాళ్లు స్వాతంత్ర్య సమరయోధులా..?: మద్రాస్ హైకోర్టులో పిల్

Plea In Madras High Court Opposes Rs 10 Lakh Compensation for Hooch Victims
  • ప్రజల కోసమో, సమాజ హితం కోసమో వారు చనిపోలేదన్న పిటిషన్ దారుడు
  • ఈ విషయంలో ప్రభుత్వాన్ని గైడ్ చేయాలంటూ విజ్ఞప్తి
  • కళ్లకురిచిలో కల్తీ సారా తాగి ఇటీవల 65 మంది మృతి
తమిళనాడులోని కళ్లకురిచిలో ఇటీవల కల్తీసారా తాగి 65 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అయితే, ఈ భారీ పరిహారంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీసారా తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ఇంత మొత్తం పరిహారం ఎలా ఇస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కళ్లకురిచిలో చనిపోయిన వారంతా కల్తీసారా బాధితులు మాత్రమేనని, వారేమీ స్వాతంత్ర్య సమరయోధులు కారని మహ్మద్ గౌస్ అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు.

బాధిత కుటుంబాలకు ఇంత భారీ మొత్తం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ‘వాళ్లు (కల్తీ సారా మృతులు) స్వాతంత్ర్య సమరయోధులు కారు.. సంఘ సేవకులు అసలే కారు. వారు చనిపోయింది ప్రజల కోసమో, సమాజం కోసమో కాదు.. కల్తీ సారా తాగడం వల్ల. అలాంటి వారికి రూ.10 లక్షల పరిహారం ఎలా ఇస్తారు?’ అంటూ మహ్మద్ ప్రశ్నిస్తున్నారు. కల్తీ సారా తాగడమే చట్ట వ్యతిరేకమైన పని.. అలాంటిది కల్తీ సారా తాగి చనిపోయిన వారికి ప్రభుత్వం పరిహారం ప్రకటించడం విడ్డూరంగా ఉందని తన పిటిషన్ లో పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో ఆత్మీయులను పోగొట్టుకున్న వారిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి కానీ ఇలా తాగి చనిపోయిన వారిని కాదని అన్నారు. దేశం కోసం పోరాడి చనిపోయారా.. వాళ్లు ఏమైనా స్వాతంత్ర్య సమరయోధులా.. వారి కుటుంబాలకు ఏ లెక్కన రూ. పది లక్షల పరిహారం ఇస్తారంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కళ్లకురిచిలో కల్తీ సారా తాగి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే.
Hooch Victims
Tamilnadu
Kallakurichi
Rs.10 lakh
Compensation

More Telugu News