Rishi Sunak: రిషి సునాక్ పాలనకు ముగింపు.. యూకే తదుపరి ప్రధానిగా కీర్ స్టార్మర్!

Early Results shows Labour will Sweep UK Election 2024 and Rishi Sunak Braces For Huge Loss
  • యూకే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌లో స్పష్టంగా కనిపిస్తున్న ట్రెండ్
  • అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న లేబర్ పార్టీ అభ్యర్థులు
  • చారిత్రాత్మక విజయం ఖాయమనేలా సంకేతాలు
భారత సంతతికి చెందిన వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రుషి సునాక్ యూకే మాజీ ప్రధాని కాబోతున్నారు. లేబర్ పార్టీ చీఫ్ కీర్ స్టార్మర్ యూకే తదుపరి ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆ దేశ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ట్రెండ్స్‌ను బట్టి స్పష్టమవుతోంది. భారత కాలమానం ప్రకారం.. లేబర్ పార్టీ అభ్యర్థులు 267 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ కేవలం 47 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో వుంది. ఆధిక్యం సాధిస్తున్న లేబర్ పార్టీ అభ్యర్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ ట్రెండ్స్‌ను చూస్తుంటే యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించడం ఖాయంగా కనిస్తోంది.

కాగా లండన్‌లోని లేబర్ పార్టీ చీఫ్, కాబోయే ప్రధాని స్టార్మర్ ఘన విజయాన్ని సాధించారు. ఆరంభ ఫలితాల్లో హోల్‌బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్ స్థానం నుంచి ఆయన 18,884 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తాను గెలుపొందిన నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తికి సేవ చేస్తానంటూ ఈ సందర్భంగా స్టార్మర్ ప్రకటించారు.

కాగా యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేసిన విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్‌లో మొత్తం 650 సీట్లు ఉన్నాయి. లేబర్ పార్టీ 410 స్థానాలను గెలుచుకోబోతోందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు పడబోతోందని అంచనా వేశాయి. ఇక ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి 131 స్థానాలు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.
Rishi Sunak
Keir Starmer
UK Election 2024
UK Election Results

More Telugu News