S. Somanath: అదే జరిగితే మానవాళి అంతమైపోతుంది.. ఇస్రో చీఫ్ హెచ్చరిక

Asteroid Hitting Earth Real Possibility Must Prepare Says ISRO Chief
  • గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే అవకాశం కచ్చితంగా ఉందన్న ఎస్. సోమనాథ్
  • సమీప భవిష్యత్తులో ఇలాంటి విపత్తును మానవాళి చూడకపోవచ్చని వ్యాఖ్య
  • భవిష్యత్తులో ఈ ప్రమాదాన్ని తప్పించేందుకు ముందుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచన
  • వ్యోమనౌకతో ఢీకొట్టి గ్రహశకలాన్ని దారి మళ్లించే విధానం అందుబాటులో ఉందన్న ఇస్రో చీఫ్
  • ఈ దిశగా ప్రపంచదేశాలు కలిసికట్టుగా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని పిలుపు
గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు. అదే జరిగితే మానవాళితో పాటు భూమ్మీదున్న అధిక శాతం జీవరాశి అంతమైపోతుందని హెచ్చరించారు. ప్రపంచ గ్రహశకల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్రో ఓ వర్క్ షాపు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఇస్రో చీఫ్ పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో పలు విషయాలపై ముచ్చటించారు. 

‘‘మన జీవితకాలం 70 - 80 ఏళ్లే. కాబట్టి మనం ఇలాంటి విపత్తులను చూడకపోవచ్చు. దీంతో, గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తాం. కానీ చరిత్రలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తరచూ భూమిని గ్రహశకలాలు ఢీకొడుతుంటాయి. గురుగ్రహాన్ని ఓ గ్రహశకలం ఢీకొట్టడాన్ని నేను చూశాను. అలాంటిదే భూమ్మీద జరిగితే మనందరం అంతరించిపోతాం. ఇవన్నీ కచ్చితంగా జరుగుతాయి. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. పుడమి తల్లిని ఇలాంటి విపత్తు నుంచి రక్షించాలి. భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాలను దారి మళ్లించే మార్గం ఉంది. భూమికి సమీపంగా ఉన్న గ్రహశకలాలను ముందుగా గుర్తించి ప్రమాదం నివారించొచ్చు. అయితే, ఒక్కోసారి ఇలా చేయడం సాధ్యపడకపోవచ్చు. కాబట్టి, ఇందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలి. భారీ వ్యోమనౌకలతో ఢీకొట్టించి గ్రహశకలాలను భూమ్మీద పడకుండా దారి మళ్లించాలి. ఇందు కోసం ప్రపంచదేశాలు ఉమ్మడిగా వివిధ విధానాలు రూపొందించాలి’’ అని అన్నారు. 

భవిష్యత్తులో ఈ ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయని అన్నారు. ప్రమాదం తప్పదన్న సమయంలో మానవాళి మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి ప్రమాద నివారణకు నడుం బిగిస్తుందన్నారు. అంతరిక్ష రంగంలో ముందడుగేస్తున్న ఇస్రో ఈ దిశగా బాధ్యత తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కేవలం భారత్ కోసం కాకుండా ప్రపంచ క్షేమం కోసం రాబోయే విపత్తును నివారించేందుకు అవసరమైన సాంకేతిక, ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
S. Somanath
ISRO
Asteroid Hitting Earth
World Asteroid Day

More Telugu News