Revanth-PM Meet: నేడు ప్రధానితో భేటీ కానున్న తెలంగాణ సీఎం

Telangana CM Revanth Reddy to meet with PM Modi today
  • ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
  • నేడు సాయంత్రం ప్రధానితో సమావేశానికి అపాయింట్‌మెంట్ ఖరారు
  • పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్న రేవంత్ రెడ్డి
  • శనివారం హైదరాబాద్‌లో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. గతవారమే ఇరువురు సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ లోక్‌సభ సమావేశాల దృష్ట్యా అది వాయిదా పడింది. నేటి సాయంత్రం ప్రధానితో భేటీకి సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ లభించినట్టు తెలిసింది. అయితే, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, అభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలను సీఎం ప్రధానికి దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

ఈసారి సమావేశంలో తెలంగాణకు సంబంధించి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బొగ్గు గనుల వేలంలో సింగరేణికి భాగస్వామ్యం కల్పించడం, సైనిక్ స్కూల్ ఏర్పాటు, రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్రానికి అప్పగించడం, విభజన చట్టంలోని అపరిష్కృతంగా ఉండిపోయిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గిరిజన వర్సిటీకి నిధుల కేటాయింపు తదితర అంశాలను సీఎం రేవంత్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

ఇదిలా ఉంటే, ఏపీ సీఎం చంద్రబాబు కూడా గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రధానితో సమావేశం కానున్నారు. ఇక శనివారం చంద్రబాబు, రేవంత్ హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు.
Revanth-PM Meet
New Delhi
Telangana
Central Government

More Telugu News