Mahesh Chandra Laddha: ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా నియామకం

IPS mahesh Chandra laddha appointed as AP Intelligence Chief
  • కేంద్ర సర్వీసుల డిప్యుటేషన్ పూర్తి చేసుకుని తిరిగొచ్చిన ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్హా
  • వెంటనే ఆయన్ను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • ఏపీలోని పలు జిల్లాలు, హైదరాబాద్‌లో ఎస్పీ, డీసీపీగా పని చేసిన లడ్హా
  • ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు మావోయిస్టుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ వైనం
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఐపీఎస్ అధికారి మహేశ్‌చంద్ర లడ్హా నియమితులయ్యారు. 1998 బ్యాచ్ అధికారి అయిన లడ్హా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అనంతరం, ఆయనను నిఘా విభాగాధిపతిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఐపీఎస్ మహేశ్ చంద్ర లడ్హా గతంలో గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ ఈస్ట్‌ జోన్ డీసీపీగా, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏలో దాదాపు ఐదేళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా విధులు నిర్వర్తించారు. విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా, నిఘా విభాగంలో ఐజీగానూ చేశారు. 2019-20 మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా పని చేసి కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. అక్కడ సీఆర్పీఎఫ్‌లో ఐజీగా నాలుగేళ్ల పాటు పని చేసి తాజాగా ఏపీకి తిరిగొచ్చారు. 

మావోయిస్టుల దాడి.. 
ప్రకాశం జిల్లా ఎస్పీగా లడ్హా సేవలందిస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు క్లెమోర్‌మైన్స్‌తో పేల్చేశారు. అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో లడ్హాతో పాటు ఆయన ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. అప్పట్లో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Mahesh Chandra Laddha
Andhra Pradesh
AP Police
Intelligence Chief

More Telugu News