Bhole Baba: హథ్రాస్ విషాదం: తెల్లటి సూట్, టైతో బోధనలు... ఎవరీ భోలే బాబా?

Who is Bhole Baba
  • హథ్రాస్ ఘటనలో 100 మందికి పైగా భక్తుల మృతి
  • ప్రతి మంగళవారం సత్సంగ్ ఏర్పాటు చేస్తున్న భోలే బాబా
  • 26 ఏళ్ల క్రితం ఆధ్యాత్మిక మార్గంలోకి భోలే బాబా
  • యూపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భక్తులు
యూపీలోని హథ్రాస్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 100 మందికి పైగా భక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. భోలే బాబాగా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సాకార్ హరి ఈ ప్రైవేటు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పటియాలి తహసీల్‌లోని బహదూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లుగా చెప్పుకున్నాడు. 17 ఏళ్ల పాటు ఇందులో పని చేశాడు.

26 ఏళ్ల క్రితం ఉద్యోగం వదిలి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినట్లు చెప్పుకుంటాడు. తనకు గురువు కూడా ఎవరూ లేరని చెబుతుంటాడని స్థానికులు అంటుంటారు. సమాజం కోసం ఆధ్యాత్మిక బాట పట్టినట్లు చెబుతుంటాడట. తెల్లటి సూట్, టైతో ఆయన బోధనలు చేస్తుంటాడు. ఇతనికి ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలలో వేలాదిమంది భక్తులు ఉన్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కరోనా సమయంలోనూ ఈయన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చేవారు.

తన భార్యతో కలిసి అతను సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఇతను ప్రతి మంగళవారం సత్సంగ్ నిర్వహిస్తుంటాడు. హథ్రాస్‌కు ముందు మంగళవారం మెయిన్‌పురి జిల్లాలో సత్సంగ్ నిర్వహించాడు.

2022 కరోనా గైడ్ లైన్స్ ఉన్న సమయంలో సత్సంగ్ కోసం ఫరూఖాబాద్ అధికారులను అనుమతి అడిగారు. 50 మందితో సత్సంగ్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పాడు. కానీ 50 వేల మంది రావడంతో అధికారులు తలపట్టుకున్నారు. హథ్రాస్‌లో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకోవడానికి భక్తులు పోటీ పడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగింది.
Bhole Baba
Uttar Pradesh
Hathras

More Telugu News