Rahul Dravid: నేను నిరుద్యోగిని.. జాబ్ ఆఫర్లు ఉంటే చెప్పండి ప్లీజ్‌: రాహుల్ ద్రవిడ్‌

Rahul Dravid jokes about job search after World Cup win
  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో ముగిసిన రాహుల్ ద్ర‌విడ్ కోచ్ ప‌ద‌వీకాలం
  • ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం మీడియాతో స‌ర‌దా వ్యాఖ్య‌లు
  • ఇక‌పై తాను నిరుద్యోగినంటూ చ‌మ‌త్క‌రించిన ద్ర‌విడ్‌
ద‌క్షిణాఫ్రికాను ఓడించి భార‌త జ‌ట్టు రెండోసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవ‌సం చేసుకుంది. దీంతో 140 కోట్ల మంది భార‌త ప్ర‌జ‌లు సంబ‌రాల్లో మునిగిపోయారు. ఇక టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ ఆనందం అంతా ఇంతా కాదు. ఆయన ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారు. 

కాగా, ప్ర‌పంచ‌క‌ప్ గెలపులో భాగంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటుండగా, ఆయన కూడా ఉద్వేగానికి లోనయ్యారు. ఎప్పుడు నిశబ్దంగా ఉంటూ, తక్కువగా మాట్లాడే ఆయన తొలిసారిగా గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకుంటూ కనిపించారు. ఇది చూసి ఆట‌గాళ్లు కూడా ఆయన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. 

అయితే, టీ20 ప్రపంచకప్ తర్వాత ఆయన హెడ్ కోచ్ గా మూడేళ్ల‌ పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక‌పై తాను నిరుద్యోగినంటూ చెప్పుకొచ్చారు. త‌న‌కు ఏమైనా జాబ్ ఆఫ‌ర్లు ఉంటే చెప్పాలంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే టోర్నీలో టీమిండియా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింద‌న్నారు. ప్లేయ‌ర్లంద‌రూ గొప్ప‌గా ఆడార‌ని, ఇది నిజంగా అద్భుత‌మైన జ‌ట్టు అని పేర్కొన్నారు.  

ద్రవిడ్ 2021లో న‌వంబ‌ర్‌లో టీమిండియా ప్ర‌ధాన కోచ్‌ పదవీ బాధ్యతలు  చేపట్టారు. అప్పటి నుంచి 2023 వరకూ భార‌త జ‌ట్టుకు సేవలు అందించారు. కాగా, గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ తోనే ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగియాల్సింది. కానీ, బీసీసీఐ కోరిక మేర‌కు 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ వ‌ర‌కు ఆయన తన బాధ్యతలను కొన‌సాగించారు. జట్టును విజేతగా నిలిపారు.

ఇక కోచ్ గా ద్రవిడ్ ను మరికొంత కాలం ఉండాలని బీసీసీఐ కోరినప్పటికీ, ఆయన ఈ రిక్వెస్ట్ ను తిరస్కరించారు. దీంతో కొత్త కోచ్ వేటను మొదలెట్టింది బీసీసీఐ. ఇదే విషయమై గతంలోనూ భార‌త సారధి రోహిత్ శర్మ మాట్లాడాడు. ఆయనకు చాలా కారణాలు ఉండుంటాయని, అందుకే తాము కూడా ఆయన మాటను కాదనలేకపోయామన్నాడు. ద్రవిడ్‌తో గడిపిన సమయం చాలా విలువైనదని పేర్కొన్నాడు. 

ఇదిలాఉంటే.. త‌దుప‌రి టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరు వినిపిస్తోంది. ద్రవిడ్ వారసుడిగా గంభీర్ దాదాపు క‌న్ఫార్మ్ అయిన‌ట్లు తెలుస్తోంది.
Rahul Dravid
Team India
Head Coach
Cricket
Sports News

More Telugu News