Crocodile: రోడ్డుపై 8 అడుగుల భారీ మొసలి సంచారం.. వీడియో వైరల్

Crocodile casually strolls through streets of Ratnagiri in Maharashtra
  • భారీ వర్షాలకు సమీపంలోని నది నుంచి కొట్టుకొచ్చిన మకరం
  • వాహనాలు తిరుగుతున్నా లెక్కచేయకుండా కలియతిరిగిన వైనం
  • మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఘటన
  • బెంబేలెత్తిన స్థానికులు.. జనావాసాల్లోకి మొసళ్లు రాకుండా చర్యలు చేపట్టాలని వినతి
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, జలపాతాలన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో అక్కడక్కడా జలచరాలు జనావాసాల్లోకి కొట్టుకొస్తున్నాయి. తాజాగా రత్నగిరి జిల్లాలోని తీరప్రాంతమైన చిప్లన్ లోని చించ్ నాకా పరిసరాల్లో ఆదివారం రాత్రి ఓ 8 అడుగుల మొసలి పక్కనే ఉన్న నది నుంచి రోడ్డుపైకి కొట్టుకొచ్చింది.

వాహనాలు తిరుగుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా సంచరిస్తూ హల్ చల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రోడ్డుపై మొసలి ఠీవీగా సంచరించడాన్ని చూసిన స్థానికులంతా భయాందోళనలకు గురయ్యారు. 

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో చిత్తడి నేలలలో మొసళ్లు అధికంగా జీవిస్తున్నాయి. వాటిని మగ్గర్స్ అంటారు. దేశంలో మొత్తంగా మగ్గర్స్ జాతి మొసళ్లతోపాటు ఉప్పునీటి మొసళ్లు, ఘారియల్ మొసళ్లు ఉన్నాయి. రత్నగిరి జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మొసళ్లకు ఆవాసంగా ఉన్న శివ నది నుంచి ఈ మొసలి కొట్టుకొచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే మొసళ్లు జనావాసంలోకి రాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని తీర ప్రాంతవాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇటీవల యూపీలోని బులంద్ షహర్ లోనూ ఈ తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడి గంగా నది కాలువ నుంచి ఓ 10 అడుగుల భారీ మొసలి బయటకు వచ్చింది. అధికారులు దాన్ని పట్టుకొనేందుకు ప్రయత్నించగా ఇనుపు రెయిలింగ్ మీద నుంచి దూకేందుకు ప్రయత్నించింది. చివరకు అధికారులు దాన్ని బంధించి తిరిగి నీటిలో విడిచిపెట్టారు.
Crocodile
Road Rage
Maharashtra
Ratnagiri District
Heavy Rains
Floods

More Telugu News