Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై సీఎంను ప్రశ్నించిన సామాన్యురాలు.. వీడియో విడుదల చేసిన టీడీపీ

A woman Questions AP CM Chandrababu About Polavaram Project
  • ఏపీలో పౌరులకు ఉన్న స్వేచ్ఛ ఇదీ అంటూ వివరణ
  • పోలవరం ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పలేదని అడిగిన మహిళ
  • రాష్ట్ర ప్రజలంతా తెలుసుకోవాల్సిన విషయమంటూ చంద్రబాబు వివరణాత్మక జవాబు
పోలవరం ప్రాజెక్టుపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తిచేస్తారనే ప్రశ్నకు జవాబివ్వలేదేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఓ సామాన్య మహిళ ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పెన్షన్ పండుగలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతుండగా ఓ మహిళ ఆయనను ప్రశ్నించింది. దీనికి సీఎం చంద్రబాబు వివరణాత్మక జవాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రజలంతా తెలుసుకోవాలని, చాలా మంచి ప్రశ్న వేశావని ఆ మహిళను మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేస్తూ.. ఇదీ రాష్ట్రంలో పౌరులకు ఉన్న స్వేచ్ఛ అంటూ క్యాప్షన్ జోడించింది.

పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు వివరణ ఇస్తూ.. ఓ దుర్మార్గుడు తన దుర్మార్గపు ఆలోచనలతో, నిపుణులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి పనిచేస్తే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనంగా పోలవరం ప్రాజెక్టు మిగిలిపోయిందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రాజెక్టుకు జరిగిన నష్టం ఇప్పటి వరకు 70 వేల కోట్లుగా నిపుణులు లెక్కించారని తెలిపారు. ఇది లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలో తమకే అర్థం కావడంలేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నపుడు రెండు సీజన్లలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి డయాఫ్రాం వాల్ నిర్మించామని చెప్పారు. ఆ తర్వాత స్పిల్ వే కట్టామని, కాఫర్ డ్యాంలు కూడా పూర్తిచేశామని వివరించారు.

మే లో ఓడిపోవడంతో డయాఫ్రాం వాల్ పూర్తిచేయలేకపోయామని, ఈ లోపు జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి కాంట్రాక్టర్ ను మార్చేశారని వివరించారు. రెండేళ్లు ప్రాజెక్టును వదిలేయడంతో వరదలకు డయాఫ్రాం వాల్ దెబ్బతిందని చెప్పారు. కాఫర్ డ్యాంలు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విషయంలో ఏంచేయాలనేదానిపై అమెరికా, కెనడా ఇంజనీర్లను రప్పించి, వారితో చర్చిస్తున్నామని తెలిపారు.

Polavaram Project
Chandrababu
woman Questioned
TDP Tweet

More Telugu News