Chandrababu: పరదాలు కడుతున్నారు సార్.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మధ్య సరదా సంభాషణ.. అందరి ముఖాల్లో నవ్వు

Funny conversation between CM Chandrababu and Minister Lokesh in public meeting in Mangalagiri constituency
  • పరదాల విషయంలో అధికారులు మారడానికి టైమ్ పడుతుందేమో అన్న మంత్రి లోకేశ్
  • పరదాలు కట్టినవాళ్లను సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం లేదంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చిన సీఎం
  • ఒక షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారని నవ్వుతూ హెచ్చరించిన చంద్రబాబు
ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పథకాన్ని ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా పింఛను అందజేశారు. అనంతరం పెనుమాకలో పింఛనుదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మధ్య ఆసక్తికరమైన సరదా సంభాషణ జరిగింది.

వేదికపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ‘‘ సార్.. మీరు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాల అమలులో తొలి అడుగు వేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని మా పెనుమాక గ్రామానికి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. గత ఐదేళ్లు పరదాల ముఖ్యమంత్రిని చూశాం. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నాం. అయితే అధికారులు సెట్ కావడానికి ఇంకా టైమ్ పడుతుందేమో సార్. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. బతిమలాడి అన్నీ తీసివేసినా కడుతున్నారు’’ అని అన్నారు.

లోకేశ్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు చిరునవ్వుతో స్పందించారు. ‘‘లేదు.. అధికారులు మారిపోయారు. ఇంకొక్కసారి పరదాలు కడితే.. కట్టినవాళ్లను సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. ఇలాంటివి నేను వినదలచుకోలేదు. ఎవరైనా సరే పాత రోజులు మరచిపోయి కొత్త రోజులు జ్ఞాపకం తెచ్చుకొని ముందుకు సాగిపోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఎక్కడా ఇలాంటివి జరగకూడదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పనిష్‌మెంట్ తప్పదు’’ అని చంద్రబాబు నవ్వుతూ అన్నారు.

మంత్రి లోకేశ్ కలగజేసుకుంటూ, 'ఐదు సంవత్సరాలు కదా సార్.. కాస్త టైమ్ పడుతుందేమో మారడానికి' అన్నారు . ప్రతి స్పందించిన చంద్రబాబు.. ‘‘మీకు కూడా (మంత్రులు) అందరికీ అలవాటు కావాలి. కొత్త శకానికి, కొత్త కల్చర్‌కు అందరూ అలవాటు పడాలి. ఇక టైమ్ ఉండదు. రివర్స్ పోయే బండిని పాజిటివ్‌గా నడిపిస్తున్నాం. స్పీడ్ పెంచాలే తప్ప వెనక్కి పోకూడదు. ఆ ఆలోచనే రాకూడదు. లేకపోతే ఒక షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు. షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ’’ అని చంద్రబాబు నవ్వుతూనే అధికార యంత్రానికి కీలక సూచనలు చేశారు.
.
Chandrababu
Nara Lokesh
Mangalagiri
Andhra Pradesh

More Telugu News