Hurricane Beryl: ‘హరికేన్ బెరిల్’ ఎఫెక్ట్‌తో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన టీమిండియా.. రంగంలోకి బీసీసీఐ!

Hurricane Beryl disrupted the Indian teams plans to travel to New York
  • తీవ్రమైన తుపాను ప్రభావంతో బ్రిడ్జ్‌టౌన్‌ ఎయిర్‌పోర్టులో విమాన సేవల రద్దు
  • తిరిగి రావాల్సిన భారత జట్టు అక్కడే ఆగిపోయిన పరిస్థితి
  • బార్బడోస్ నుంచి నేరుగా ఢిల్లీకి చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసే యోచనలో బీసీసీఐ
పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024 సాధించిన టీమిండియా ఆటగాళ్లు ఆదివారం సాయంత్రం భారత్ తిరుగు పయనమవ్వాల్సి ఉన్నా అనివార్య పరిస్థితుల కారణంగా అక్కడే ఆగిపోయారు. అట్లాంటిక్‌ సముద్రంలో ఏర్పడిన ‘హరికేన్ బెరిల్’ తీవ్ర ప్రభావం బార్బడోస్‌పై కూడా పడింది. అక్కడ గంటకు 210 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో బ్రిడ్జ్‌టౌన్‌లోని ఎయిర్‌పోర్టులో ఆదివారం సాయంత్రం విమాన సర్వీసులు అన్నింటినీ రద్దు చేశారు. నిజానికి బార్బడోస్ నుంచి న్యూయార్క్ వెళ్లి.. అక్కడి నుంచి ఎమిరేట్స్ విమానంలో ముంబై రావాల్సి ఉంది. కానీ ‘హరికేన్ బెరిల్’ ప్రభావంతో ప్రయాణం వాయిదా పడిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

 ప్రయాణం వాయిదా పడిన నేపథ్యంలో తదుపరి ఏర్పాట్లను బీసీసీఐ సెక్రటరీ జై షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కలుపుకొని మొత్తం 70 మంది బార్బడోస్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. దీంతో అమెరికా నుంచి భారీ చార్టెర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి నేరుగా బ్రిడ్జ్‌టౌన్ నుంచి న్యూఢిల్లీ తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. జులై 2న న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆటగాళ్లు చేరుకునే అవకాశం ఉంది. వీరికి ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆటగాళ్లను మోదీకలిసే ఛాన్స్
వరల్డ్ కప్ గెలిచిన ఆటగాళ్ల బృందం నేరుగా ఢిల్లీకి వెళ్తే వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా చిరస్మరణీయ టీ20 ప్రపంచ కప్ 2024 గెలుపు అనంతరం భారత ఆటగాళ్ల రాక కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Hurricane Beryl
Team India
T20 World Cup 2024
Barbados
Bridgetown

More Telugu News