Team India: వారెవ్వా టీమిండియా... టీ20 వరల్డ్ కప్ మనదే

Team India wins T20 World Cup 2024 by beating South Africa in thrilling final
  • టీ20 వరల్డ్ కప్ విజేతగా అవతరించిన రోహిత్ సేన
  • ఫైనల్లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం
  • అద్భుతంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా, బుమ్రా
  • రాణించిన కోహ్లీ, అక్షర్ పటేల్
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచ విజేతగా అవతరించింది. సస్పెన్స్ థ్రిల్లర్ తలపించిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024ను సగర్వంగా ఒడిసిపట్టింది. వెస్టిండీస్ లోని బ్రిడ్జిటౌన్ లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి చాంపియన్ గా నిలిచింది. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేయగా... ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది.

ఓ దశలో హెన్రిచ్ క్లాసెన్ భయపెట్టినా... హార్దిక్ పాండ్యా సమయోచితంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. క్లాసెన్ ను హార్దిక్ పాండ్యా అవుట్ చేయడమే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు. 

చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా... మరోసారి బంతిని అందుకున్న హార్దిక్ పాండ్యా... ఆ ఓవర్ ను అద్భుతంగా విసిరి టీమిండియాకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని ఖరారు చేశాడు. ఆ ఓవర్లో తొలి బంతికి మిల్లర్ భారీ షాట్ కొట్టగా, బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుత రీతిలో పట్టిన క్యాచ్ మరో మేలిమలుపు అయింది. ఆ క్యాచ్ ను వదిలి ఉంటే సిక్సర్ అయ్యేది. అదే ఓవర్లో రబాడా కూడా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా కథ దాదాపుగా ముగిసింది! మొత్తమ్మీద ఆ ఓవర్లో రెండు వికెట్లు తీసిన పాండ్యా 8 పరుగులే ఇచ్చాడు. 

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చూస్తే... ఓపెనర్ క్వింటన్ డికాక్ 39, ట్రిస్టాన్ స్టబ్స్ 31, డేవిడ్ మిల్లర్ 21 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ సింగ్ 2, జస్ప్రీత్ బుమ్రా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. 

మధ్యలో బుమ్రా బౌలింగ్ చేసిన తీరు సూపర్బ్. కీలక దశలో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు. డాట్ బాల్స్ వేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టాడు. మిగతా పనిని హార్దిక్ పాండ్యా పూర్తి చేశాడు. 

అంతకుముందు, టీమిండియా ఇన్నింగ్స్ లో కోహ్లీ బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో పోరాడదగ్గ స్కోరు సాధించిందంటే అందుకు కారణం కోహ్లీ పట్టుదలే. కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 47, శివమ్ దూబే 27 పరుగులతో రాణించారు. ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్  కోహ్లీకే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ఇచ్చారు.

ఇక, టీమిండియా చరిత్రలో ఇది రెండో టీ20 వరల్డ్ కప్ టైటిల్. 2007లో ధోనీ నాయకత్వంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతలు అయ్యాక, మళ్లీ ఇన్నాళ్లకు మనవాళ్లు కప్ ను గెలిచారు. 2014లో ఫైనల్స్ చేరినా అప్పుడు శ్రీలంక చేతిలో ఓటమి ఎదురైంది. 

ఓవరాల్ గా చూస్తే ఇది భారత్ కు నాలుగో ఐసీసీ కప్. 1983లో తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ చేజిక్కించుకున్న భారత జట్టు... ఆ తర్వాత 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, ఇప్పుడు 2024లో టీ20 వరల్డ్ కప్ ను సాధించింది.

ఈ టీ20 వరల్డ్ కప్-2024 విజయంతో టీమిండియాకు రూ.19.95 కోట్లు పారితోషికం లభించనుండగా... రన్నరప్ దక్షిణాఫ్రికా రూ.10.64 కోట్లు అందుకోనుంది!

మరోవైపు, దక్షిణాఫ్రికా జట్టు ఈ ఓటమితో తీవ్ర నిరాశకు గురైంది. ఆ జట్టు వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. కప్ చేజిక్కించుకోవాలన్న ఆశలు నెరవేరకపోవడంతో సఫారీ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. 

ఇక, టీమిండియా ఆటగాళ్లు కప్ గెలిచిన ఆనందంలో భావోద్వేగాలకు లోనయ్యారు. హార్దిక్ పాండ్యా చివరి బంతి విసరగానే... రోహిత్ శర్మ మైదానంలో పడిపోయి నేలను కసిదీరా కొడుతూ విజయోత్సాహాన్ని ప్రదర్శించాడు. హార్దిక్ పాండ్యా గెలిచిన ఆనందంలో ఏడ్చేశాడు. 

ముఖ్యంగా, టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కు ఇదే చివరి ఈవెంట్. ఈ వరల్డ్ కప్ ను గెలవడం ద్వారా టీమిండియా ఆటగాళ్లు  ద్రావిడ్ కు ఘనంగా వీడ్కోలు పలికినట్టయింది. టీ20 వరల్డ్ కప్ గెలవడంతో ద్రావిడ్ కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. ద్రావిడ్ ను టీమిండియా ఆటగాళ్లు పైకెత్తి అభినందించారు.
Team India
Champions
T20 World Cup 2024
South Africa

More Telugu News