Sonia Gandhi: ఎమర్జెన్సీ విషయంలో ప్రజలు 1977లోనే స్పష్టమైన తీర్పు ఇచ్చారు!: మోదీపై సోనియా ఆగ్రహం

Sonia Gandhi takes assault on Constitution dig at PM over Emergency remarks
  • ప్రధాని మోదీ ఎన్నికల్లో నైతికంగా ఓడిపోయారన్న సోనియాగాంధీ
  • రాజ్యాంగంపై దాడి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎమర్జెన్సీపై మాట్లాడుతున్నారని విమర్శ
  • ప్రజాతీర్పును ప్రధాని అర్థం చేసుకున్నారనడానికి ఒక్క ఆధారమూ లేదని వ్యాఖ్య
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ నైతికంగా ఓడిపోయారని, అయినప్పటికీ ఏమీ జరగనట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఎమర్జెన్సీ గురించి ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు పదేపదే ప్రస్తావించడాన్ని ఆమె తప్పుబట్టారు. రాజ్యాంగంపై దాడి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎమర్జెన్సీని పదేపదే పలుకుతున్నారన్నారు. ఎమర్జెన్సీ విషయంలో ప్రజలు 1977లోనే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు.

తాజాగా సోనియా హిందూ పత్రికలో ఎడిటోరియల్ కాలమ్ రాశారు. మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీట్ పరీక్ష పేపర్ లీక్, మణిపూర్ అల్లర్లు సహా వివిధ అంశాలను ఆమె అందులో లేవనెత్తారు. ప్రజాతీర్పును ప్రధాని అర్థం చేసుకున్నారనడానికి ఒక్క ఆధారమూ లేదన్నారు. ఓటర్లు జూన్ 4న స్పష్టమైన తీర్పును ఇచ్చారన్నారు. ఆయన ఏకాభిప్రాయం విలువలను బోధిస్తారని... అదే సమయంలో నిందారోపణలకు అవకాశం కల్పిస్తారని విమర్శించారు.

లోక్ సభ స్పీకర్ ఎన్నికలో ప్రభుత్వంతో ఏకాభిప్రాయానికి ఇండియా కూటమి అంగీకరించిందన్నారు. అయితే సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలన్నారు. తాము అడిగితే ప్రభుత్వం తోసిపుచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో సమతుల్యత, ఉత్పాదకతను పెంపొందించేందుకు విపక్ష కూటమి కట్టుబడి ఉందన్నారు. పరీక్షపే చర్చ చేసే ప్రధాని పరీక్ష పత్రాల లీకేజీపై మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sonia Gandhi
Narendra Modi
Congress
BJP
Emergency

More Telugu News