Nara Bhuvaneswari: చల్లపల్లి ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూలులో పిల్లలను కలుసుకుని భావోద్వేగాలకు లోనైన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari met NTR Model School students in Challapalli
  • కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ మోడల్ స్కూలు స్థాపించిన నారా భువనేశ్వరి
  • 400 మందికి పైగా అనాథలు, పేద పిల్లలకు ఉచితంగా విద్య, ఆశ్రయం
  • నేడు చల్లపల్లిలో ఎన్టీఆర్ మోడల్ స్కూలును సందర్శించిన భువనేశ్వరి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి 400కి మందికి పైగా అనాథలు, పేద కుటుంబాల బాలలను చదివిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ స్థాపించిన నారా భువనేశ్వరి అనాథలు, పేద పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచిత వసతి కల్పిస్తున్నారు. ఈ విద్యాలయంలో ఆశ్రయం పొందుతున్న బాలబాలికలకు అమ్మానాన్న అన్నీ నారా భువనేశ్వరి అంటే అతిశయోక్తి కాదు. 

ఇవాళ చల్లపల్లిలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ కు నారా భువనేశ్వరి విచ్చేసిన సందర్భంగా భావోద్వేగాలు ఉప్పొంగాయి. చాలా రోజుల త‌రువాత పిల్ల‌ల మ‌ధ్య భువనేశ్వరి ఎంతో ఆనందంగా గ‌డిపారు. భువనేశ్వరి నాడు చంద్రబాబు అక్ర‌మ అరెస్టుని నిర‌సిస్తూ 'నిజం గెల‌వాలి' అంటూ రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించారు. అనంత‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ కూట‌మి త‌ర‌ఫున విస్తృత ప్ర‌చారం చేశారు. ఈ బిజీ షెడ్యూల్ వ‌ల్ల ఎన్టీఆర్ స్కూలుని సంద‌ర్శించ‌లేక‌పోయారు. 

ఇప్పుడు ఎన్నికలు ముగిసి, ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో, వెసులుబాటు కలగడంతో పిల్ల‌ల్ని చూడాల‌నే ఆరాటంతో నారా భువనేశ్వరి నేడు చ‌ల్ల‌ప‌ల్లి ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూలుని సంద‌ర్శించారు. 

ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. సిబ్బందితో ఆత్మీయంగా మాట్లాడి ఫోటోలు దిగారు. పిల్ల‌లంద‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ హ‌త్తుకున్నారు. సౌక‌ర్యాలు ఎలా ఉన్నాయ‌ని ఆరా తీశారు. 

అమ్మ ఒడిని చేరిన పిల్ల‌ల తీరుగా అంద‌రూ భువ‌నేశ్వరిని చుట్టుముట్టారు. ఆమెవారితోనే భోజ‌నం చేశారు. చ‌క్క‌గా చ‌దువుకుని ఎన్టీఆర్ స్కూలు విద్యార్థులమ‌ని గ‌ర్వంగా చాటి చెప్పాల‌ని ఉద్బోధించారు. నారా భువనేశ్వరి చాలా రోజుల త‌రువాత హాయిగా, న‌వ్వుతూ పిల్ల‌ల‌తో కాల‌క్షేపం చేసి... అప‌రిమిత ఆనందంతో పిల్ల‌ల‌కు వీడ్కోలు ప‌లికారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ సీఓఓ గోపి అడుసుపల్లి, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
Nara Bhuvaneswari
NTR Model School
Students
Challapalli
Krishna District
TDP

More Telugu News