Rohit Sharma: కోహ్లీ దారుణ వైఫల్యంపై ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ స్పందన

Rohit Sharma continued to back the star batter Virat Kohli
  • విరాట్ కోహ్లీకి మద్దతుగా మాట్లాడిన కెప్టెన్
  • కోహ్లీ ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదని వ్యాఖ్య
  • నైపుణ్యం ఉన్న ఆటగాడని సమర్థన
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ఫైనల్ చేరినప్పటికీ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహకారం ఏమాత్రం లేదు. ఈ మెగా టోర్నీలో విరాట్ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 75 పరుగులు మాత్రమే చేశాడు. ఎంత పేలవ ప్రదర్శన చేశాడో ఈ రన్స్‌ను చూస్తే అర్థమైపోతోంది. రెండు సార్లు డకౌట్ కూడా అయ్యాడు.

ఇక అత్యంత కీలకమైన సెమీ ఫైనల్‌లోనూ ఇదే తరహా ప్రదర్శన చేశాడు. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు కొట్టి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో రీస్ టోప్లీ వేసిన ఓవర్‌లో షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. కాగా మ్యాచ్ అనంతరం విరాట్ ప్రదర్శనపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. విరాట్‌కు మద్దతుగా రోహిత్ మాట్లాడాడు. కోహ్లీ ఫామ్‌ ఆందోళన కలిగించే అంశం కాదని అన్నాడు.

కోహ్లీ నాణ్యమైన ఆటగాడని, ఎలాంటి ఆటగాడైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడని మద్దతుగా నిలిచాడు. విరాట్ ఎలాంటి ఆటగాడో, అతడి విలువేంటో తాము అర్థం చేసుకోగలమని అన్నాడు. ఫామ్ ఎప్పుడూ సమస్య కాదని, అతడి ఉద్దేశం ముఖ్యమని అన్నాడు. దీని ద్వారా ఫైనల్‌ ఆడించడం ఖాయమని రోహిత్ సంకేతాలు ఇచ్చాడు.

ఇక ఇంగ్లండ్‌పై విజయంపై స్పందిస్తూ.. ఒక జట్టుగా చాలా ప్రశాంతంగా ఈ మ్యాచ్ ఆడామని, పరిస్థితులకు తగ్గట్టు ఆడామని వివరించాడు. చక్కటి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నామని, ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే చేయాలనుకుంటున్నామని రోహిత్ చెప్పాడు.
Rohit Sharma
Virat Kohli
T20 World Cup 2024
Cricket

More Telugu News