Jagan: కాంగ్రెస్ లో వైసీపీ విలీనం కోసం జగన్ ప్రయత్నం.... సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి

BJP MLA Nallamilli alleges Jagan tries to merge his party into Congress
  • జగన్ దిక్కుతోచని స్థితిలో పడ్డాడన్న అనపర్తి  ఎమ్మెల్యే నల్లమిల్లి
  • జగన్ నిన్న బెంగళూరులో డీకే శివకుమార్ ను కలిశాడని వెల్లడి
  • షర్మిలను కాంగ్రెస్ నుంచి పంపించివేస్తే, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్నాడని వివరణ
అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో దీనిపై చర్చలు జరిపారని తెలిపారు. 

"జగన్ పాలనలో 2019 నుంచి 2024 వరకు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగింది. ఆ అప్రకటిత ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ  ప్రజలు కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. ఎప్పుడైనా సరే ప్రజలు నియంత పాలనను అంగీకరించరు అని దీని ద్వారా తెలుసుకోవచ్చు. 

అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులేస్తున్నాడు. నిన్న బెంగళూరులో డీకే శివకుమార్ ను కలిసి మాట్లాడాడు. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపిస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సంసిద్ధం అని ప్రతిపాదించే నిస్సహాయ స్థితికి చేరాడు. 

వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, అందులో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి! నలుగురు ఎంపీలు గెలిస్తే, వారిలో ఎంతమంది తనతో కలిసి వస్తారో తెలియదు! ఉన్న రాజ్యసభ సభ్యులు ఇక ముందు కూడా తనతోనే ఉంటారో, ఉండరో తెలియని పరిస్థితి! 

అంతెందుకు... పులివెందులకు వెళితే అక్కడ కార్యకర్తలే తన ఇంటిపై దాడి చేస్తే జగన్ నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. కడప జిల్లాలో గెలిచిన వైసీపీ అభ్యర్థులు కానీ, ఓడిన అభ్యర్థులు కానీ కడప రాజప్రాసాదం వైపు చూడని పరిస్థితి ఏర్పడింది. 

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకు వెళుతున్నాడు. ఇలాంటి అరాచక శక్తులన్నీ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే అవకాశముంది" అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Jagan
YSRCP
Congress
Nallamilli Ramakrishna Reddy
BJP
Andhra Pradesh

More Telugu News