Team India: ఆస్ట్రేలియాను ఓడించి.. సగర్వంగా సెమీస్‌కు టీమిండియా

India beat Australia to qualify for T20 World Cup 2024 semifinal and to fight with England in semis
  • ఆసీస్‌ను 24 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
  • 206 పరుగుల లక్ష్య ఛేదనలో 181 పరుగులకే పరిమితమైన కంగారూలు
  • రాణించిన భారత బౌలర్లు
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరవ విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 పరుగులు బాదడం, బౌలర్లు అందరూ సమష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 24 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 

భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 76 పరుగులు బాదాడు. ఇక కెప్టెన్ మిచెల్ మార్ష్ వేగంగా ఆడి 37 పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ ఆసీస్ వైపే ఉన్నట్టుగా అనిపించింది. అయితే భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక సమయంలో 2 ముఖ్యమైన వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు, బుమ్రా 1 వికెట్ పడగొట్టడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. నిర్ణీత  20 ఓవర్లలో 181 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. మిగతా ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ 6, గ్లేన్ మ్యాక్స్‌వెల్ 20, మార్కస్ స్టోయినిస్ 2, టిమ్ డేవిడ్ 15, మాథ్యూ వేడ్ 1, పాట్ కమిన్స్ 11 (నాటౌట్), మిచెల్ స్టార్క్ 4 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ చొప్పున తీశారు.

ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 92, కోహ్లీ 0, పంత్ 15, సూర్యకుమార్ యాదవ్ 31, శివమ్ దూబే 28, హార్ధిక్ పాండ్యా 27 (నాటౌట్), రవీంద్ర జడేజా 9 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ చెరో 2 వికెట్లు పడగొట్టగా హేజెల్ ఉడ్ ఒక వికెట్ తీశాడు. 92 పరుగులతో అద్భుతంగా రాణించిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 

సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఢీ..
గ్రూప్-1 నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. జూన్ 27న గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో రెండవ సెమీఫైనల్‌ పోరులో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కాగా 2022 టీ20 వరల్డ్ కప్‌లో కూడా సెమీఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి ఫైనల్‌కు వెళ్లిన ఇంగ్లిష్ జట్టు టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది.

కాగా గ్రూప్-1 నుంచి మరో సెమీ ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య పోటీ నెలకొంది. బంగ్లాదేశ్‌పై గెలిస్తే ఆఫ్ఘనిస్థాన్ నేరుగా సెమీస్ చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే నెట్ రన్ రేట్ ఆధారంగా ఆసీస్, ఆఫ్ఘాన్ జట్లలో ఒకటి సెమీస్ చేరుకుంటుంది. అర్హత సాధించిన జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొట్టాల్సి ఉంటుంది.
Team India
T20 World Cup 2024
India vs Australia
Cricket
India vs England

More Telugu News