GST Council: ఢిల్లీలో ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం... వివరాలు ఇవిగో!

GST Council meeting chaired by Nirmala Sitharaman concluded in New Delhi
  • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
  • సెక్షన్ 73 కింది విధించే జరిమానాలపై చర్చ
  • జరిమానాలపై వేస్తున్న వడ్డీని ఎత్తివేయాలంటూ ప్రతిపాదనలు
  • సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదన
  • కార్టన్ బాక్సులు, పాలకాన్లు, సోలార్ కుక్కర్లపై 12 శాతానికి జీఎస్టీ తగ్గింపు
  • పలు రకాల రైల్వే సేవలకు జీఎస్టీ మినహాయింపు
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన వివరాలను నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

సెక్షన్ 73 కింద విధించే జరిమానాలపై ప్రధానంగా చర్చించినట్టు వెల్లడించారు. జరిమానాలపై వేస్తున్న వడ్డీ ఎత్తివేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 

ఇక, అన్ని కార్టన్ బాక్సులపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని నిర్ణయించామని చెప్పారు. ఆపిల్, ఇతర పండ్ల వ్యాపారులకు ఈ నిర్ణయంతో మేలు కలుగుతుందని, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ లోని ఆపిల్ సాగుదారులకు లాభిస్తుందని అన్నారు. 

స్ప్రింకర్లపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం వ్యవసాయరంగానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలిపారు. అల్యూమినియం, స్టీల్ పాల క్యాన్లపై, సోలార్ కుక్కర్లపై కూడా జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

రైల్వే ప్లాట్ ఫాం టికెట్లు, రైల్వే శాఖ అందించే వెయిటింగ్ రూమ్ సేవలు, రిటైరింగ్ రూమ్ సేవలు, సామాన్లు భద్రపరుచుకునే సౌలభ్యం, రైల్వే శాఖ ప్లాట్ ఫాంలపై అందించే బ్యాటరీ ఆధారిత వాహన సేవలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించనున్నట్టు తెలిపారు. 

ఇక, రేట్ రేషనలైజేషన్ మంత్రుల సంఘం చైర్మన్ గా బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిని నియమించినట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
GST Council
Nirmala Sitharaman
New Delhi
NDA
India

More Telugu News