Anti Paper Leak Law: అమల్లోకి పేపర్ లీకుల నిరోధక చట్టం.. నిందితులకు రూ. కోటి వరకూ జరిమానా!

Anti Paper Leak Law Notified Amid Exam Mess Jail Term Fine Up To A Crore
  • ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్- 2024ను శుక్రవారం నోటిఫై చేసిన కేంద్రం
  • ఇకపై పేపర్ లీకుల కేసులన్నీ కొత్త చట్టం కింద నమోదు
  • నిందితులకు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా
  • వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే ఆస్తులు కూడా జప్తు
నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల అంశం దేశంలో కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ - 2024ను శుక్రవారం నోటిఫై చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల హడావుడి మొదలుకావడంతో అమలు తేదీని ప్రకటించలేదు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశ్నించగా.. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు. ఆ మరుసటి రోజే కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

కొత్త చట్టం ప్రకారం, ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లు అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. నిందితులకు 5 నుంచి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ.కోటి వరకూ జరిమానా విధిస్తారు. నిందితులు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్టయితే వారి ఆస్తులనూ జప్తు చేస్తారు. ఇకపై పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టం కిందే నమోదు చేయనున్నారు.
Anti Paper Leak Law
NEET
UGC-NET
Central Government

More Telugu News