Mudragada Padmanabha Reddy: ఆయన బాటలోనే పవన్ కూడా సినిమాలు వదిలేయాలి: ముద్రగడ పద్మనాభరెడ్డి

Mudragada asks Pawan should leave cinemas like NTR did in past
  • నాడు ఎన్టీఆర్ సీఎం అయ్యాక సినిమాలు వదిలేశాడన్న ముద్రగడ
  • పవన్ కూడా ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన
  • పూర్తిగా ప్రజాసేవకే అంకితం అవ్వాలని స్పష్టీకరణ
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఇవాళ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే సినిమాలు వదిలేశారని, పవన్ కల్యాణ్ కూడా ఎన్టీఆర్ బాటలోనే సినిమా రంగాన్ని పూర్తిగా వదిలేయాలని సూచించారు. 

"అప్పట్లో ఎన్టీఆర్ సీఎం పీఠం ఎక్కాక సినిమాల్లో నటించడం పూర్తిగా మానేశారు. చట్టం ఒప్పుకోకపోవడం వల్ల అలా చేశారేమో తెలియదు. మధ్యలో ఒకసారి ఓ సినిమాలో నటించాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచో, సుప్రీంకోర్టు నుంచో అనుమతి తీసుకుని నటించారు. పవన్ గారూ... మీరు కూడా ఎన్టీఆర్ తరహాలోనే సినిమా రంగానికి పూర్తిగా వీడ్కోలు పలికి ప్రజాసేవకు మీ జీవితాన్ని అంకితం చేయండి. 

ముఖ్యంగా కాపు, బలిజ యువతకు మీ సేవలు అందించండి. మీరు సినిమా రంగాన్ని వదులుకుంటే మంచిదని నా భావన. అక్కడా ఇక్కడా రెండు కాళ్లు వేయడం కష్టం. ఎన్టీఆర్ అంతటివాడే సినిమాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వంలో కొనసాగాడు. 

పవన్ కల్యాణ్ గారూ... మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులతో కూడిన మెసేజ్ లు పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని అనుకుంటున్నాను. మీ భాషలో అలాంటి మెసేజులు పెట్టించాలి అనుకుంటే పెట్టించండి... నేను బాధపడను. 

దీనికంటే ఓ పనిచేయండి.... మా ఇంట్లో ఏడుగురం ఉంటాం... మనుషులను పంపించి ఒకేసారి చంపించేయండి... మేమేమీ అడ్డుపడం... మేం అనాథలం, మాకెవరూ లేరు. అంతేకానీ బూతులు మాట్లాడించడం మంచిది కాదు... అందుకే అలాంటి మెసేజులు ఆపించాలని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. 

ఇక, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, బీసీ రిజర్వేషన్ల విషయంలో మీ అడుగులు వేగంగా పడాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు కాబట్టి... వారి ఆశలు వమ్ముచేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ ముద్రగడ పద్మనాభరెడ్డి వివరించారు.
Mudragada Padmanabha Reddy
Pawan Kalyan
Cinemas
NTR
Govt

More Telugu News