YS Sharmila: రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంపై ష‌ర్మిల ఏమ‌న్నారంటే..!

YS sharmila on On the Rushikonda Palace Controversy
  • ఏపీ రాజకీయాల్లో సంచలనంగా రుషికొండ అంశం
  • ఇదే అంశంపై తాజాగా స్పందించిన ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు షర్మిల 
  • రుషికొండ ప్యాలెస్‌ కోసం ప్రజాధనం ఖర్చు పెట్టి ఉంటే క్షమించరాని నేరమని వ్యాఖ్య‌ 
  • ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల‌ని డిమాండ్
ఏపీ రాజకీయాల్లో రుషికొండ అంశం సంచలనంగా మారింది. ప్రజాధనం వందల కోట్లు దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి తాను ఉండేందుకు క్యాంప్ ఆఫీసు కట్టించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం రుషికొండలో నిర్మాణాలపై ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. కనీసం లోపలి ఫొటోలు కూడా బ‌య‌ట‌కు రాలేదు. కానీ, ఇటీవ‌ల‌ ప్రభుత్వం మారడంతో.. సీన్ మారిపోయింది. వైసీపీ స‌ర్కార్ ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేసిందంటూ ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దుమ్మెత్తిపోస్తోంది.  

ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్‌ షర్మిల కూడా స్పందించారు. రుషికొండ ప్యాలెస్‌ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే అది క్షమించరాని నేరమన్నారు. రుషికొండ ప్యాలెస్‌ను ఎందుకోసం నిర్మించారో ప్రజలకు తెలియాలన్నారు. అలాగే రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలన్నారు. తప్పని రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక వైసీపీ ప్ర‌భుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసిందని.. విచ్చలవిడిగా ఖర్చు చేసిందని షర్మిల ఆరోపించారు.
YS Sharmila
Congress
Andhra Pradesh
Rushikonda Palace Controversy

More Telugu News