Karnataka High Court: బాధితురాలిని పెళ్లి చేసుకొని రావాలంటూ అత్యాచార నిందితుడికి కర్ణాటక హైకోర్ట్ బెయిల్

Karnataka High Court Grants 15 Day Bail To a Accused in Key case
  • ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదరడంతో బాధితురాలితో నిందితుడి పెళ్లి నిశ్చయం
  • ఇటీవలే బాధితురాలికి నిండిన 18 ఏళ్లు
  • తదుపరి విచారణ లోగా పెళ్లి చేసుకొని సర్టిఫికేట్ తీసుకోవాలని ఆదేశం
కర్ణాటక హైకోర్ట్ అనివార్య పరిస్థితుల్లో ఓ అత్యాచార నిందితుడికి 15 రోజుల బెయిల్ ఇచ్చి పెళ్లి చేసుకొని రావాలని ఆదేశించింది. 23 ఏళ్ల నిందిత యువకుడు దాదాపు ఏడాదిన్నర క్రితం 16 సంవత్సరాల 9 నెలల వయసున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె గర్భవతి అయింది. ఒక బిడ్డకు జన్మనిచ్చింది. డీఎన్‌ఏ పరీక్షల్లో నిందితుడే చిన్నారి తండ్రి అని నిర్ధారణ అయింది. కాగా అత్యాచార అభియోగాలపై నిందితుడు జైలులో ఉన్న సమయంలో ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది. బాధితురాలికి, నిందితుడికి పెళ్లి నిశ్చయించారు. దీంతో తనపై కేసులు కొట్టివేసి ఉపశమనం కల్పించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో నిందితుడు పిటిషన్ దాఖలు చేశాడు. 

బిడ్డ రక్షణ, బాధితురాలి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఇద్దరూ పెళ్లి చేసుకోవడం మంచిదని భావించింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ పిటిషనర్ అయిన నిందితుడికి 15 రోజుల బెయిల్ ఇచ్చింది. జులై 3న సాయంత్రం కస్టడీకి రావాలని, జులై 4న జరగనున్న తదుపరి విచారణకు వివాహ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని రావాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎం నాగప్రసన్న శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా తన కూతురిపై నిందితుడు పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 2023లో నిందితుడిని అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 376(2)(ఎన్) తో పాటు పోక్సో చట్టం-2012లోని 5(ఎల్), 5(జే)(ii),  సెక్షన్-6 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Karnataka High Court
Bail To Accused
Karnataka
Viral News

More Telugu News