Haris Rauf: భారతీయుడు అనుకొని కొట్టడానికి పరిగెత్తుకొచ్చిన పాక్ క్రికెటర్ రౌఫ్.. వీడియో ఇదిగో

Pakistan Cricketer Haris Rauf Runs To Hit Trolling Fan Thinking He Is Indian
  • కామెంట్ చేసిన పాక్ అభిమానిపై గొడవకు దిగిన క్రికెటర్
  • ‘నువ్వు భారతీయుడివే కదా?’ అంటూ కొట్టేందుకు వచ్చిన పేసర్
  • నిలువరించిన అక్కడున్నవారు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
టీ20 వరల్డ్ కప్ 2024 లీగ్ దశ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టుపై స్వదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్స్ నుంచి మాజీల వరకు అందరూ ఆటగాళ్ల ప్రదర్శనపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే ఒక రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా కనిపించినా వదలడం లేదు. దీంతో పాక్ ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తమను ఎగతాళి చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్ ఆవేశంతో ఒక పాక్ అభిమానిని కొట్టబోయాడు. ఈ మేరకు ఫ్లోరిడాలో ఆసక్తికర ఘటన జరిగింది.

తన భార్యతో కలిసి నడిచి వెళ్తున్న హరీస్ రౌఫ్‌పై కొందరు పాకిస్థానీ క్రికెట్ అభిమానులు నోరుపారేసుకున్నారు. వరల్డ్ కప్‌లో దారుణ ప్రదర్శన నేపథ్యంలో రౌఫ్‌ను ఏవో కామెంట్లు చేశారు. దీంతో రౌఫ్ సహనాన్ని కోల్పోయాడు. సదరు అభిమానిని కొట్టేందుకు ఆగ్రహంతో పరుగెత్తుకొని వెళ్లాడు. రౌఫ్ భార్య కూడా అతడిని నియంత్రించేందుకు ప్రయత్నించింది. రౌఫ్ చెయ్యి పట్టుకొని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అతడు మాటవినలేదు. అయితే అక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరినీ ఆపి, సర్ది చెప్పారు. దీంతో రౌఫ్ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లాడు. 

కాగా వైరల్‌గా మారిన వీడియోలో ‘నువ్వు భారతీయుడే కదా?’ అంటూ రౌఫ్ ఆవేశంగా మాట్లాడడం కనిపించింది. ‘కాదు నేను పాకిస్థానీని’ అంటూ గొడవకు దిగిన అభిమాని సమాధానం ఇవ్వడం వీడియోలో వినిపించింది. భారతీయుడు అనుకొని కొట్టడానికి వెళ్లాడని ఈ వీడియోని బట్టి స్పష్టమవుతోంది. కాగా టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ నిష్ర్కమించినప్పటికీ పలువురు ఆటగాళ్లు ఇంకా స్వదేశం వెళ్లలేదు. తీవ్ర విమర్శల నేపథ్యంలో అమెరికాలోనే ఉన్నారు.
Haris Rauf
Pakistan
Team India
T20 World Cup
Cricket

More Telugu News