Gemini App: గూగుల్ 'జెమిని' యాప్ తో తెలుగులోనూ ఏఐ సేవలు

Google launches Gemini app that features 9 launguanges including Telugu
  • భారత్ లో ఏఐ యాప్ విడుదల చేసిన గూగుల్
  • 9 భాషల్లో జెమిని ఏఐ అసిస్టెంట్ యాప్
  • ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో యాప్ 
చాట్ జీపీటీ పుణ్యమా అని ప్రముఖ సెర్చ్ ఇంజిన్లన్నీ ఏఐ బాట పడుతున్నాయి. గూగుల్ కూడా జెమిని (గతంలో బార్డ్) టూల్ తీసుకువచ్చింది. తాజాగా ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం తన జెమిని ఏఐ అసిస్టెంట్ టూల్ ను మరింత అభివృద్ధి చేసింది. గూగుల్ తన జెమిని టూల్ ను మొబైల్ యాప్ రూపంలో భారత్ లో విడుదల చేసింది. 

ఇది 9 భాషల్లో సేవలు అందిస్తుంది. అందులో తెలుగు భాష కూడా ఉంది. ఈ యాప్ సాయంతో ఏదైనా సెర్చ్ చేయొచ్చు. టైప్ చేయడం ఎందుకు అనుకుంటే... వాయిస్ అసిస్టెంట్ ను గానీ, ఫొటో ను గానీ ఉపయోగించి సెర్చ్ చేయొచ్చు. ప్రస్తుతానికి జెమిని ఏఐ అసిస్టెంట్ యాప్ ను ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. మున్ముందు ఐఓఎస్ వాడకందార్లకు కూడా ఈ యాప్ అందుబాటులోకి రానుంది. 

కాగా, జెమిని యాప్ లో రెండు వెర్షన్లు ఉన్నాయి. ఒకటి సాధారణ వెర్షన్ కాగా, దీనికి ఎలాంటి రుసుం చెల్లించనక్కర్లేదు. రెండోది... ప్రీమియం వెర్షన్. దీంట్లో ఫీచర్లు కొంచెం అడ్వాన్స్ డ్ గా ఉంటాయి. అందుకోసం నెలకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 

జెమిని ఏఐ టూల్ ను అభివృద్ధి చేస్తూనే ఉంటామని, రాబోయే రోజుల్లో కొత్త ఫీచర్లను జోడిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. కాగా, ఈ జెమిని యాప్ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ భాషల్లో సేవలు అందిస్తుంది.
Gemini App
Google
AI Tool
Android

More Telugu News