White House: ఇకపై జీవిత భాగస్వాముల ఇమ్మిగ్రేషన్‌ సులభతరం.. అమెరికా గుడ్‌న్యూస్!

White House said that Biden will unveil new rules easing the process for undocumented spouses of US citizens
  • అమెరికాలో పదేళ్ల నివాసం, జూన్ 17, 2024 నాటికి యూఎస్ పౌరుడిని పెళ్లి చేసుకొని ఉంటే అర్హత
  • కొత్త నిబంధనను ప్రవేశపెట్టనున్న బైడెన్ సర్కారు
  • 50 వేల మంది వరకు అర్హత పొందుతారని అంచనా
అమెరికా పౌరసత్వం పొందిన వలస జీవులకు అక్కడి ప్రభుత్వం గొప్ప సడలింపు ఇవ్వబోతోంది. సరైన ధృవీకరణ పత్రాలు లేని జీవిత భాగస్వాములకు శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డ్) కల్పించే ప్రక్రియను సులభతరం చేయబోతోంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టనున్నారని అమెరికా అధ్యక్ష కార్యాలయం ‘వైట్ హౌస్’ ప్రకటించింది. అమెరికన్ పౌరుల్లో చాలా మందికి తలనొప్పిగా మారిన ఈ సమస్యను పరిష్కరించాలని, సులభ ప్రక్రియ ద్వారా శాశ్వత నివాసానికి అనుమతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించింది. కాగా ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బైడెన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 

కొత్త నిబంధనలతో శాశ్వత నివాస అర్హత పరిధి ఏమాత్రం పెరగదు. అయితే ఇప్పటికే అర్హత పొందినవారి నివాస హోదా క్రమబద్ధీకరణను వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారు దేశం విడిచి వెళ్లాలనే రూల్‌ను తొలగించింది. నూతన నిబంధనల ప్రకారం.. అమెరికాలో కనీసం పదేళ్ల నివాసం, జూన్ 17, 2024 లోగా అమెరికా పౌరుడిని వివాహం చేసుకోవడం అర్హతలుగా ఉన్నాయి. ఈ సడలింపు ద్వారా దాదాపు 500,000 మంది అమెరికాలో శాశ్వత నివాసం పొందుతారని అంచనాగా ఉంది. అదనంగా 50 వేల మంది అమెరికా పౌరుల సవతి పిల్లలు కూడా అర్హత సాధించవచ్చునని కథనాలు పేర్కొంటున్నాయి.

కాగా అమెరికా శాశ్వత నివాస హోదా పొందినవారు అక్కడ ఉద్యోగం చేయడానికి అనుమతి ఉంటుంది. అంతేకాదు అమెరికాలో శాశ్వత నివాస దరఖాస్తు కోసం మూడేళ్ల వరకు అమెరికాలో నివసించే హక్కు కూడా కల్పిస్తారు. ఇక శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డు) పొందిన వ్యక్తులు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కాగా ఇమ్మిగ్రేషన్ విధానాల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనంటూ రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆయన ఆలోచనలకు భిన్నంగా బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
White House
Joe Biden
USA
US Citizenship
Spouses of US Citizens

More Telugu News