Train Accident: ప్యాసింజర్ రైలుని ఢీకొన్న గూడ్స్ ట్రైన్.. ఐదుగురి మృతి

Goods Train Crashes Into Kanchanjungha Express In Bengal
  • 20-25 మంది ప్రయాణికులకు గాయాలు
  • పట్టాలు తప్పిన కంచన్‌జుంఘా ఎక్స్‌ప్రెస్‌‌కు చెందిన 2 కోచ్‌లు
  • పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం
  • ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాకు వెళ్తున్న కంచన్‌జుంఘా ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ రైలుని ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. న్యూ జల్‌పాయ్‌గురికి సమీపంలోని రంగపాణి స్టేషన్‌కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు వెనుక నుంచి వచ్చి ప్యాసింజర్ రైలుని ఢీకొట్టింది. ఈ  ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారని, 20-25 మంది గాయపడ్డారని డార్జిలింగ్ జిల్లా పోలీసు అదనపు ఎస్పీ అభిషేక్ రాయ్ వెల్లడించారు. 

ఈ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు. డాక్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఆమె తెలిపారు. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి ఇప్పుడే తెలిసిందని, ఈ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కంచన్‌జుంఘా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు సమాచారం అందిందని చెప్పారు. డీఎం, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు నిర్వహణ బృందాలను అక్కడికి తరలించామని తెలిపారు. సహాయ చర్యలు యుద్ధ ప్రతిపాదికన ప్రారంభమయ్యాయని ఆమె వివరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Train Accident
Kanchanjungha Express
West Bengal
Mamata Banerjee

More Telugu News