Uttam Kumar Reddy: ఇరిగేషన్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Minister Uttam Kumar Reddy blames BRS government over project issues
  • రీడిజైన్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణ
  • 9వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకూ నీరు ఇవ్వలేదన్న భట్టివిక్రమార్క
  • గత ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసిందన్న పొంగులేటి
తాను ఈ ఆరు నెలల కాలంలో చాలా ప్రాజెక్టులను సందర్శించానని... గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రీడిజైన్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్‌ను తెలంగాణ మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం పరిశీలించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్టు పూర్తయ్యాక సీతారామ ప్రాజెక్టు కెనాల్‌కు రాజీవ్ కెనాల్‌గా పేరు పెడతామన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.9 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. కేవలం రూ.2654 కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ.20 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మీద విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక్క ప్రాంతంలో కూడా నీరు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. ఆగస్ట్ 15 నాటికి నల్గొండ, వైరా ప్రాంతాలకు లక్షా ఇరవై వేల ఎకరాలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
Uttam Kumar Reddy
Telangana
BRS

More Telugu News