Allahabad High Court: ప్రేమ పెళ్లిపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Allahabad High Court said that No one can restrain an adult from going and staying anywhere that he or she likes
  • మేజర్లు తమకు ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోనివ్వకుండా ఎవరూ ఆపలేరన్న హైకోర్టు
  • ఓ ప్రేమ పెళ్లి విషయంలో భర్తపై భార్య బంధువులు పెట్టిన కిడ్నాప్ కేసును కొట్టివేసిన ధర్మాసనం
  • కుటుంబ సభ్యుల నుంచి భార్యకు రక్షణ కల్పించాలని ఆదేశాలు
  • ఆర్టికల్ 21 కింద ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు ఉన్నాయన్న కోర్టు
మేజర్లను తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోనివ్వకుండా, నచ్చిన చోటుకు పోనివ్వకుండా , ఇష్టమైన చోట బతకకుండా ఎవరూ నిరోధించలేరని అలహాబాద్ హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తోందని కోర్టు వివరించింది. మేజర్లు అయిన ఓ జంట ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోగా.. భార్య తరపు బంధువులు భర్తపై పెట్టిన కిడ్నాప్ కేసును హైకోర్ట్ తోసిపుచ్చుతూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
 
భార్య మేనమామ ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేయడమే కాకుండా.. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ భార్య వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాత కూడా ఆమెను తల్లిదండ్రుల ఇంటికి తిరిగి పంపించడాన్ని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. 

21 ఏళ్ల వయసున్న ముస్లిం యువతి ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో తనకు నచ్చిన వ్యక్తిని ముస్లిం సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేసింది. అయితే భార్య మేనమామ ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్) కింద వరుడిపై కిడ్నాప్ కేసు పెట్టాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా భర్తను అరెస్ట్ చేశారు. అంతేకాదు భార్యను కూడా అరెస్ట్ చేసి ఆమెను మేనమామకు అప్పగించి ఇంటికి పంపించారు.

సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద భార్య వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పోలీసులు ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అయితే తనకు నచ్చిన వ్యక్తిని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నానని, తన భర్తను తప్పుడు కేసులో ఇరికించారని ఆమె వాంగ్మూలం ఇచ్చింది. అయినప్పటికీ పోలీసులు ఆమెను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.

దీంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చినా తనను ఇంటికి పంపించారని, తనకు ప్రాణహాని ఉందని భార్య పేర్కొంది. మామయ్య తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్‌లతో కూడిన బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాత కూడా ఆమెను ఇంటికి పంపిస్తూ మేజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయాన్ని బెంచ్ తప్పుబట్టింది. యువతిని చంపుతానన్న ఆమె మేనమామపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే జంటకు భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పిటిషనర్ భద్రత, జీవితానికి రక్షణ కల్పించాలని పేర్కొంది.

ఈ ఘటనల విషయాల్లో పరువు హత్యలు తెలియని విషయాలు కాదని న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని భార్య ఫిర్యాదు చేసినా పట్టించుకోని విషయంలో ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ జిల్లా ఎస్పీ, బంసీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇద్దరూ సమానంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. మేనమామపై కేసు నమోదు చేసి మహిళ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఇక భర్తపై నమోదయిన కిడ్నాప్ కేసును కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జూన్ 7న కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
Allahabad High Court
Judicial Magistrate
Article 21
Judicial News

More Telugu News