Chiranjeevi: గుండెల నిండా సంతోషం... పవన్ ప్రమాణ స్వీకారంపై చిరంజీవి స్పందన

Chiranjeevi opines on Pawan Kalyan takes oath as AP Minister
  • ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్
  • హాజరైన చిరంజీవి, రామ్ చరణ్, ఇతర కుటుంబ సభ్యులు
  • పవన్ ఏపీ మంత్రి కావడం పట్ల గర్వంగా ఉందన్న చిరంజీవి
  • పవన్ విజయం 100 శాతం చారిత్రాత్మక విజయమన్న రామ్ చరణ్
తన తమ్ముడు పవన్ కల్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గుండెల నిండా సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉందన్న భరోసా కలుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో సమర్థులు, సుదీర్ఘ పాలనా అనుభవం, శక్తిసామర్థ్యాలు ఉన్న నాయకులు వచ్చారని కొనియాడారు. 

పాత-కొత్త కలయికలో ఈ మంత్రివర్గం చాలా చాలా బాగుందని కితాబునిచ్చారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని ఇప్పుడు చూస్తారని చిరంజీవి ధీమా వెలిబుచ్చారు. తన తమ్ముడు ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం పట్ల గర్వంగా అనిపిస్తోందని అన్నారు. 

ఎంతో కష్టపడిన తర్వాత వచ్చిన విజయం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో తన పాత్రను సమర్థంగా నిర్వర్తించగలడని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాడని తమ్ముడిపై నమ్మకం వ్యక్తం చేశారు. 

పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా మీడియాతో మాట్లాడతారు. ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తమకు ఇది మహోజ్వలమైన రోజు అని అభివర్ణించారు. 

పిఠాపురంలో తన బాబాయ్ పవన్ కల్యాణ్ సాధించింది 100 శాతం చారిత్రక విజయం అని రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Chiranjeevi
Pawan Kalyan
Minister
Ram Charan
Janasena
Pithapuram
Andhra Pradesh

More Telugu News