Mohan Majhi: నా భర్త ముఖ్యమంత్రి అవుతాడనుకోలేదు... టీవీలో చూసి ఆశ్చర్యపోయా: ఒడిశా కొత్త సీఎం భార్య

Never thought that my husband will become CM says Mohan Majhi wife
  • తన భర్తకు మంత్రి పదవి మాత్రం దక్కుతుందనుకున్నామని వ్యాఖ్య
  • కొత్త ముఖ్యమంత్రి ఎవరా? అని టీవీలో చూస్తుంటే విషయం తెలిసిందన్న ప్రియాంక
  • సర్పంచ్‌గా పని చేసిన తన కొడుకు సీఎం స్థాయికి ఎదిగాడని తల్లి ఆనందం
తన భర్త ముఖ్యమంత్రి అవుతారని ఎప్పుడూ అనుకోలేదని ఒడిశా సీఎంగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న మోహన్ మాఝీ భార్య ప్రియాంక అన్నారు. తన భర్తను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారన్న విషయం టీవీలో చూశాకే తెలిసిందన్నారు. ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్ చరణ్ మాఝీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తన భర్త సీఎం కావడంపై ప్రియాంక స్పందించారు. ఎమ్మెల్యేలంతా మోహన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బీజేపీ అగ్రనాయకత్వం ప్రకటించిందని... ఈ వార్తను చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు.

తన భర్తకు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నానని... కానీ ముఖ్యమంత్రి అవుతారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇది తమకు చాలా గొప్ప విషయమన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరా? అని తాము టీవీ చూస్తుంటే ఈ విషయం తెలిసిందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం దిశగా ఆయన పాలన సాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక, మోహన్ మాఝీ తల్లి చెబుతూ.. తన కొడుకు యువకుడిగా ఉన్నప్పుడే ఎవరికైనా సాయం చేయడంలో ముందుండేవారని అన్నారు. సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా పని చేసిన తన కొడుకు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడని ఆనందం వ్యక్తం చేశారు. మోహన్ మాఝీ తండ్రి సెక్యూరిటీ గార్డుగా పని చేసేవారు. 1997 నుంచి 2000 వరకు మోహన్ మాఝీ గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. 2000, 2009, 2019, 2024లలో కేంఝర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా, మాఝీ తన ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌ను ఆహ్వానించారు.
Mohan Majhi
Odisha
BJP

More Telugu News