Nirmala Sitharaman: ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మల సీతారామన్

Nirmala Sitharaman assumes charge as the Union Minister of Finance
  • మోదీ 2.0లో ఆర్థిక & కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా నిర్మల సీతారామన్‌
  • మోదీ 3.0 హయాంలోనూ అదే పోర్ట్‌ఫోలియో 
  • బుధవారం ఉదయం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలమ్మ 
  • ఇప్పుడు ఆర్థిక మంత్రిపై కొత్త ప్రభుత్వంలో మొదటి బడ్జెట్‌ను రూపొందించే బృహత్తర బాధ్యత
మోదీ 3.0 ప్రభుత్వంలో కీలక శాఖలైన రక్షణ, హోమ్‌, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. ఈ శాఖలను పాత మంత్రులకే ప్రధాని మోదీ అప్పగించడం జరిగింది. మోదీ 2.0లో ఆర్థిక & కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేసిన నిర్మల సీతారామన్‌కు మోదీ 3.0 హయాంలోనూ అదే పోర్ట్‌ఫోలియో దక్కింది. దీంతో ఆమె బుధవారం ఉదయం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తన ఆఫీస్ కు వచ్చిన నిర్మలమ్మను అక్కడి సిబ్బంది పూల బొకేలతో స్వాగతించారు. అనంతరం ఆమె నార్త్ బ్లాక్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

ఇక బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. కొత్త ప్రభుత్వంలో మొదటి బడ్జెట్‌ను రూపొందించే బృహత్తర బాధ్యత ఇప్పుడు ఆర్థిక మంత్రిపై ఉంది. మోదీ 3.0 తొలి బడ్జెట్‌ను జులై మొదటి లేదా రెండో వారంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.    

కాగా, 'భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మలుస్తాం' అంటూ బీజేపీ 2.0 ప్రభుత్వంలో చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ తన మూడో టర్మ్‌లో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే బాధ్యతను నిర్మల సీతారామన్‌కు అప్పగించారు.
Nirmala Sitharaman
Union Minister of Finance
BJP

More Telugu News