TDP-JanaSena-BJP Alliance: తన కోసం వేసిన కుర్చీని మార్పించిన చంద్రబాబు.. కారణం ఇదే!

Intresting Scene On NDA Alliance meet
  • ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశంలో ఘటన
  • ప్రత్యేకమైన కుర్చీ తీసివేయించి మిగతా వారికి వేసిన కుర్చీ లాంటిదానినే తెమ్మని సూచన
  • పవన్, పురందేశ్వరి సహా అందరమూ సమానమేనని పరోక్షంగా వెల్లడించిన టీడీపీ చీఫ్
ఎన్డీయే కూటమి తరఫున శాసనసభా పక్ష నేత ఎంపిక కోసం మంగళవారం విజయవాడలో సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం సందర్భంగా వేదికపై ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సమావేశం కోసం ఏర్పాటు చేసిన వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి, అచ్చెన్నాయుడులకు కుర్చీలు వేశారు. అయితే, ఇందులో చంద్రబాబు కోసం ప్రత్యేకమైన కుర్చీ, మిగతా వారికి సాధారణ కుర్చీలను ఏర్పాటు చేశారు. వేదికపైకి వస్తుండగా కుర్చీలలో తేడాను గుర్తించిన చంద్రబాబు.. తాత్కాలికంగా ఆ కుర్చీలో కూర్చున్నప్పటికీ వెంటనే తన సిబ్బందికి సూచన చేశారు.

మిగతా కుర్చీలకు తన కుర్చీకి తేడాను చూపిస్తూ.. అలాంటి తేడాలు ఏవీ చూపించొద్దని, తనకూ మిగతా వాళ్లలాగే సాధారణ కుర్చీని తెమ్మని ఆదేశించారు. దీంతో వెంటనే సిబ్బంది చంద్రబాబు కుర్చీని మార్చేశారు. మరో సాధారణ కుర్చీని సిబ్బంది తీసుకురాగానే చంద్రబాబు లేచి ఆ కుర్చీలో ఆసీనులయ్యారు. అలా వేదికపై ఉన్న వారంతా సమానమేనని చంద్రబాబు పరోక్షంగా చాటిచెప్పారు. 

ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఇది చంద్రబాబు గారి సంస్కారం. కూటమి నేతలు పవన్ కల్యాణ్ గారు, పురందేశ్వరి గారికి గౌరవం ఇస్తూ, తనకు వేసిన ప్రత్యేకమైన కుర్చీని వద్దని, వాళ్లు కూర్చున్న కుర్చీ లాంటిదే తెమ్మని చెప్పిన చంద్రబాబు గారు’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
TDP-JanaSena-BJP Alliance
Chandrababu
Chair Change
NDA meeting Stage

More Telugu News