New Delhi: పార్ల‌మెంట్ వ‌ద్ద క‌ల‌క‌లం.. ముగ్గురి అరెస్ట్‌!

Three arrested for using forged Aadhaar cards to enter Parliament complex
  • నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంటులోకి వెళ్లేందుకు ముగ్గురి య‌త్నం
  • ఖాసిం, మోనిస్, షోయబ్‌ల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పార్లమెంట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత
రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు. గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. అనుమానం రావడంతో అక్కడి భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ చేసిన వారిని ఖాసిం, మోనిస్, షోయబ్‌గా సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది వెల్ల‌డించింది. 

వెంటనే  పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 465 (ఫోర్జరీ), 419 (వ్యక్తిగతంగా మోసం చేయడం), 120బీ (నేరపూరిత కుట్ర), 468 (మోసం చేయడం కోసం ఫోర్జరీ), 471 (నకిలీ పత్రాన్ని నిజమైనదిగా ఉపయోగించడం) కింద కేసు నమోదు చేశారు. కాగా, అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఎంపీ లాంజ్‌ను నిర్మించేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న డీ వీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న‌ట్లు స‌మాచారం. 

ఇదిలాఉంటే.. నేడు ఢిల్లీలో పలు కీలక సమావేశాలు, ఎంపీలతో ఎన్‌డీఏ కూటమి సమావేశాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ సంవిధాన్ భవన్ సెంట్రల్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్‌డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నారు.

ఈ క్రమంలో ఇలా జరగడంపై అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి.. ఎందుకు పార్లమెంట్లోకి చొరబడాలనుకున్నారో తెలుసుకునే ప‌నిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ఇక ఆమధ్య లోక్‌స‌భ‌ సందర్శకుల గ్యాలరీ నుంచి ఎంపీలు చూస్తుండగా ఇద్దరు యువకులు స్పీకర్ వెల్‌లోకి ప్ర‌వేశించి.. అక్కడ ఉన్న గ్యాస్ సిలెండర్లను ఓపెన్ చేశారు. అనంతరం సభ్యులు కూర్చునే బెంచీలపైకి దూకి నానా రచ్చ చేశారు. దీంతో ఎంపీలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మోహరించి వారిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పార్లమెంట్ వద్ద కలకలం రేగింది.
New Delhi
Parliament
Aadhaar

More Telugu News