Air Conditioners: ఎండ వేడి తగలకుండా గేదెలకు రెండు ఫ్యాన్లు, రెండు ఏసీలు!!

Watch ACs Installed In Shed To Save Buffaloes From Scorching Heat
  • నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
  • షెడ్డులో చల్లగాలికి హాయిగా గడ్డి నెమరేస్తూ సేదతీరుతున్న గేదెలు
  • అవాక్కవుతున్న నెటిజన్లు 
వాట్ యాన్ ఐడియా సర్ జీ అంటే ఇదేనమో.. సాధారణంగా ఏసీ ఆన్ చేద్దామనుకొనే వారు కూడా ఎక్కువ సేపు దాన్ని వాడితే కరెంట్ బిల్లు ఎంత పెరుగుతుందోనని కంగారు పడుతుంటారు. అలాంటిది.. ఓ పాడి రైతు ఏకంగా తన గేదెల కోసం ఏసీ పెట్టాడు! అది కూడా ఒకటి కాదండోయ్.. ఏకంగా రెండు ఏసీలు, రెండు ఫ్యాన్లను షెడ్డులో బిగించాడు!! ఎండల వేడి నుంచి మూగజీవాలను కాపాడేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఆ వీడియోలో గేదెలు రెండు ఏసీల నుంచి వచ్చే చల్లదనంతోపాటు ఓ సీలింగ్ ఫ్యాన్, మరో టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చే చల్ల గాలిని ఆస్వాదిస్తూ కనిపించాయి. హాయిగా గడ్డి నెమరేస్తూ సేదతీరాయి. దేశంలోని ఏ ప్రాంతంలో ఇలా జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం హర్యానా భాషలో పాట వినిపించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అవాక్కవుతున్నారు. తన పశువుల పట్ల పాడి రైతు చూపుతున్న ప్రేమకు ముచ్చటపడుతున్నారు. గుల్జార్ సాహెబ్ పేరుతో ఉన్న ఓ యూజర్ ‘ఎక్స్’లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ‘డబ్బున్న నగరవాసులారా.. మీ దర్పాన్ని మరింత ప్రదర్శించండి’ అంటూ ఆ వీడియో కింద కామెంట్ జత చేశాడు.

ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షలాది వ్యూస్, వేలాది లైక్ లు లభించాయి. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు పాడి రైతు నిర్ణయాన్ని మెచ్చుకుంటే మరికొందరు మాత్రం విద్యుత్ బిల్లు అంశాన్ని ప్రస్తావించారు. ‘నిజమైన కరెంట్ బిల్లు రావాలంటే ఆ రైతు తన బెడ్రూంలో రోజుకు 6 గంటలపాటు ఏసీ ఆన్ లో ఉంచాలి. గ్రామాల్లో విద్యుత్ చౌర్యం ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలిసిందే’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Air Conditioners
Shed
Buffaloes
Viral Video
Netizens
Amused

More Telugu News