TGSPDCL: కేటీఆర్ ట్వీట్ కు విద్యుత్ సంస్థ జవాబు

TGSPDCL Clarification On Former Minister KTR Tweet
  • బోడుప్పల్ లో కరెంట్ కోతలపై స్థానికుల ఆందోళన
  • నిరంతరాయంగా సప్లై చేస్తే జనం ఆందోళన ఎందుకు చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్
  • చెట్ల కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిందని వివరణ
రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, మరి జనం ఆందోళన ఎందుకు చేస్తున్నట్లు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బోడుప్పల్ సబ్ స్టేషన్ వద్ద స్థానికుల ఆందోళనను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. తాజాగా ఈ ట్వీట్ కు టీజీఎస్ పీడీసీఎల్ స్పందిస్తూ.. చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిందని వివరణ ఇచ్చింది. వెంటనే స్పందించిన తమ సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తూ మరమ్మతులు చేశారని పేర్కొంది. ఈ క్రమంలో ఒకటి రెండుసార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో బోడుప్పల్ వాసులు సబ్ స్టేషన్ కు వచ్చారని తెలిపింది. 

ఆదివారం సాయంత్రం 5:20 గంటలకు ఉదయ్ నగర్ 11 కేవీ ఫీడర్ సమీపంలో ఐదుచోట్ల ఈదురుగాలులకు చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయని టీజీఎస్ పీడీసీఎల్ పేర్కొంది. దీంతో బోడుప్పల్ చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పింది. మరమ్మతులు చేసి రాత్రి 8:10 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు వివరించింది. అయితే, ఉరుములతో కూడిన వర్షం కురవడంతో రాత్రి 9:15 గంటలకు ఇన్ కమింగ్ 33 కేవీ లైన్ లో ఇన్సులేటర్ లో సమస్య కారణంగా మరోసారి విద్యుత్ సరఫరా నిలిచిందని తెలిపింది. వెంటనే స్పందించిన సిబ్బంది బండ్లగూడ నుంచి ఉప్పల్ ఫీడర్ వరకు సబ్ స్టేషన్ కు ప్రత్యామ్నాయ సరఫరా చేసినట్లు పేర్కొంది.

రాత్రి 9:40 గంటలకు జంపర్ కట్ కారణంగా బండ్లగూడ నుంచి ఉప్పల్ ఫీడర్‌కు ఇన్‌కమింగ్ 33కేవీలో సింగిల్ ఫేజ్ విద్యుత్ అంతరాయం ఏర్పడిందని వివరించింది. ఈ సమస్యను పరిష్కరించి రాత్రి 10:25 గంటలకు బోడుప్పల్ సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు వెల్లడించింది. అయితే, సాయంత్రం నుంచి పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో స్థానికులు సబ్ స్టేషన్ వచ్చారని టీజీఎస్ పీడీసీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.
TGSPDCL
KTR Tweet
Power Supply
Power Cut
Boduppal
Sub station

More Telugu News