Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. సునామీ ముప్పు లేద‌న్న అధికారులు!

5 point 9 magnitude earthquake shakes Japan no Tsunami warning
  • ఇషికావాలో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు కంపించిన భూమి
  • భ‌య‌ప‌డి ఇళ్ల‌ నుంచి బయటకు పరుగులు తీసిన జ‌నాలు
  • నోటో పీఠభూమిలో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్‌ వాతావరణ శాఖ వెల్ల‌డి
  • ఇదే ప్రాంతంలో ఈ ఏడాది జనవరి 1న సంభవించిన భూకంపంలో 241 మంది మృతి
జపాన్‌లోని ఉత్తర-మధ్య ప్రాంతం ఇషికావాలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. సోమవారం తెల్లవారుజామున 6.31 గంటల ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే ప్రాంతంలో మరో 10 నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో మ‌రోసారి భూమి కంపించింది. దీంతో భ‌య‌ప‌డిన జ‌నాలు ఇళ్ల‌ నుంచి బయటకు పరుగులు తీశారు.

నోటో పీఠభూమిలో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్‌ వాతావరణ శాఖ వెల్ల‌డించింది. నోటో నగరంలో ఐదు కంటే తక్కువ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు స్ప‌ష్టం చేశారు. ఇదే ప్రాంతంలో ఈ ఏడాది జనవరి 1వ తారీఖున సంభవించిన భూకంపంలో 241 మంది మృతి చెందిన‌ విషయం తెలిసిందే.
Earthquake
Japan
Tsunami

More Telugu News