Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కావడం తథ్యం: కోమటిరెడ్డి

Komatireddy says KCR must be arrested in the phone tapping case
  • తెలంగాణలో కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు
  • ఫోన్ ట్యాపింగ్ ఒక నీచమైన వ్యవహారం అని కోమటిరెడ్డి ఫైర్
  • ఫోన్ ట్యాపింగ్ తో వేల కోట్లు వసూలు చేశారని ఆరోపణ
  • ప్రభాకర్ రావును భారత్ రాకుండా ఆపేందుకు హరీశ్ అమెరికా వెళ్లాడన్న కోమటిరెడ్డి
  • ఇరుక్కుపోయామని తెలిసే కేసీఆర్ మేనల్లుడ్ని అమెరికా పంపారని వ్యాఖ్యలు
తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ తథ్యమని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నీచమైన వ్యవహారం అని విమర్శించారు. 

ప్రభాకర్ రావు అనే రిటైర్డ్ అధికారి నేతృత్వంలో పనిచేసేలా రాధాకృష్ణ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న తదితరులతో ఒక రౌడీ గ్యాంగ్ మాదిరిగా ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లు చేసి వేల కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. ఎంత పెద్ద తప్పు చేశావ్ కేసీఆర్ నువ్వు? అని వ్యాఖ్యానించారు. 

"అందరం ఇరుక్కున్నాం... ఇక లాభం లేదు అని కేసీఆర్ తెలుసుకున్నారు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నాడని, ఆయన ఇక్కడికొచ్చి అప్రూవర్ గా మారితే తామంతా దొరికిపోతామని తెలుసుకుని, ముందే తన మేనల్లుడు హరీశ్ రావును అమెరికా పంపించారు. 

మే 26న ఎమిరేట్స్ విమానం (ఫ్లయిట్ నెం. ఈకే 525) వేకువ జామున 4.35 గంటలకు శంషాబాద్ నుంచి బయల్దేరింది. ఆ విమానంలో హరీశ్ అమెరికా వెళ్లాడు. తిరిగి అమెరికా నుంచి ముంబయి మీదుగా నిన్న ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లో దిగాడు. 

ఆ టెలిఫోన్ ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావు అమెరికాలోని చికాగో, కొలరాడో ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. హరీశ్ రావు ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా ఫ్యామిలీతో కలిసి అమెరికా పోయి ప్రభాకర్ రావు ను కలిశాడు. కనీసం మీడియా వాళ్లకు కూడా హరీశ్ రావు ఎక్కడికి వెళ్లాడో తెలియదు.

హరీశ్ రావు అమెరికా వెళ్లిన సంగతి ఎయిర్ పోర్టుకు వెళితే అన్ని వివరాలు లభ్యం అవుతాయి. ప్రభాకర్ రావును భారత్ కు రాకుండా ఆపేందుకు హరీశ్ రావు అమెరికా వెళ్లారు" అంటూ కోమటిరెడ్డి  ఆరోపణలు చేశారు.
Phone Tapping Case
KCR
Komatireddy Venkat Reddy
Harish Rao
Congress
BRS
Telangana

More Telugu News