Pune Accident: పూణె ప్రమాదం.. బాలుడి తల్లిని కూడా అరెస్టు చేసిన పోలీసులు!

Mother Of Pune Teen Who Ran Over 2 Techies With Porsche Arrested
  • బాలుడి బ్లడ్ శాంపిల్స్ స్థానంలో తన రక్తం ఇచ్చిన తల్లి
  • విచారణలో విషయం బయటపడడంతో అరెస్ట్
  • బాలుడి తండ్రి, తాతలను కస్టడీకి పంపిన కోర్టు
ఒక్క ప్రమాదం ఆ కుటుంబం మొత్తాన్నీ జైలుపాలు చేసింది.. పరీక్షల్లో పాస్ అయిన సందర్భంగా మద్యం తాగి కారు నడిపిన పూణె బాలుడు యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు టెకీలు అక్కడికక్కడే మరణించారు. అయితే, ప్రమాదం జరిగిందనే బాధ కానీ, ఇద్దరు చనిపోయారనే పశ్చాత్తాపం కానీ లేకుండా కొడుకును కేసు నుంచి తప్పించేందుకు ఆ బాలుడి కుటుంబం ప్రయత్నించింది. అదికాస్తా బెడిసికొట్టడంతో ఒకరి తర్వాత ఒకరుగా తల్లి, తండ్రి, తాతలు కటకటాల వెనక్కి చేరారు. 

పూణె కార్ యాక్సిడెంట్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా బాలుడి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో బాలుడు మద్యం మత్తులో ఉన్నాడని ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించారు. అయితే, బాలుడికి రక్త పరీక్ష నిర్వహించేందుకు సేకరించిన శాంపిల్స్ ను వైద్యుల సాయంతో బాలుడి తండ్రి మార్చేశాడు. బాలుడి రక్త నమూనాల స్థానంలో బాలుడి తల్లి నమూనాలు చేర్చారు. ఈ కేసు తీవ్ర సంచలనంగా మారడంతో ఉన్నతాధికారులు బాలుడికి రెండుచోట్ల రక్త పరీక్ష నిర్వహించారు.

ఒకచోట బాలుడి రక్తంలో మద్యం ఆనవాళ్లు లేవని, మరోచోట ఉన్నాయని రిపోర్టు వచ్చింది. దీంతో ఏం జరిగిందని పరిశోధించగా.. బాలుడి రక్త నమూనాలను మార్చిన విషయం బయటపడింది. ఈ నిర్వాకానికి పాల్పడిన వైద్యులపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వైద్యులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే కొడుకును తప్పించేందుకు తన రక్తం ఇచ్చిన బాలుడి తల్లిని తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Pune Accident
Porsche Car
Pune Boy
Road Accident

More Telugu News