Assam: ఏఐ టీచర్ ‘ఐరిస్’ను చూశారా? వీడియో వైరల్

Assam Gets Northeasts 1st AI Teacher Iris Students Interact In Awe
  • ఈశాన్య రాష్ట్రాల తొలి కృత్రిమ మేథ ఆధారిత హ్యూమనాయిడ్ గా రికార్డు
  • విద్యార్థుల ప్రశ్నలకు టకటకా సమాధానాలు
  • నెట్టింట వీడియో వైరల్
దేశంలోని అన్ని ప్రాంతాలకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తోంది. తాజాగా అస్సాంలో ‘ఐరిస్’ అనే ఏఐ టీచర్ స్కూల్ విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోనే తొలిసారిగా రూపొందిన హ్యూమనాయిడ్ రోబోగా రికార్డు సృష్టించింది. అన్ని రకాల ప్రశ్నలు, సందేహాలను చిటికెలో తీరుస్తూ స్టూడెంట్స్ ను అవాక్కు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

మేఖెలా చాదొర్ అనే అస్సాం సంప్రదాయ వస్ర్తధారణలో కనిపించిన హ్యూమనాయిడ్ రోబోను అస్సాంలోని ఓ ప్రైవేటు స్కూల్ సమకూర్చుకుంది. క్లాస్ లోని విద్యార్థులు ఆ రోబో టీచర్ ను ‘వాట్ ఈజ్ హిమోగ్లోబిన్  ’ అని అడగ్గానే పూర్తి వివరాలు తెలియజేస్తూ టక్కున బదులిచ్చింది.

సిలబస్ లో ఉన్న ప్రశ్నలే కాకుండా బయటి ప్రశ్నలకు కూడా అవలీలగా సమాధానాలు చెప్పింది. కొన్ని ఉదాహరణలు, రిఫరెన్స్ లను కూడా  జవాబులకు జోడించింది. సమాధానాలు చెప్పడమే కాదు.. విద్యార్థులకు ‘ఐరిస్’ షేక్ హ్యాండ్ కూడా ఇస్తోంది. దీంతో ఈ హ్యూమనాయిడ్ రోబోను చూసి స్టూడెంట్స్ తెగ ముచ్చటపడుతున్నారు.
 
‘ఐరిస్’లో ఏర్పాటు చేసిన వాయిస్ కంట్రోల్డ్ అసిస్టెంట్ ద్వారా అది స్పందించగలుగుతోంది. దీని సాయంతోనే విద్యార్థుల ప్రశ్నలకు సుదీర్ఘ వివరణ ఇవ్వడం టీచర్ రోబోకు సాధ్యమవుతోంది.

నీతి ఆయోగ్ తీసుకొచ్చిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టు భాగస్వామ్యంతో మేకర్ ల్యాబ్స్ అనే ఎడ్యు టెక్ సంస్థ ‘ఐరిస్’ను రూపొందించింది. విద్యార్థుల నేర్చుకొనే అనుభవాన్ని మరింత పెంచడంలో ‘ఐరిస్’ ఒక మైలురాయి కాగలదని హ్యూమనాయిడ్ రోబోను ప్రవేశపెట్టిన స్కూల్లో పాఠాలు చెప్పే ఓ టీచర్ అన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దేశ సంస్కృతి, చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తుల విజయగాథలతోపాటు దేశం వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలను ప్రపంచానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. ఇందుకోసం కేంద్రం ప్రత్యేకంగా వెబ్ సైట్ తోపాటు సోషల్ మీడియా హ్యాండిల్ ను క్రియేట్ చేసింది. ‘ఎక్స్’లో అమృత్ మహోత్సవ్ పేరుతో ఉన్న హ్యాండిల్ ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకుంది.
Assam
NorthEast
India
Humanoid Robot
Iris
Teacher
School
Replies
Students
Questions

More Telugu News