Manda Krishna Madiga: రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని గద్దె దింపడం ఖాయం: మంద కృష్ణ మాదిగ

Manda Krishna madiga fires at Revanth Reddy government
  • జూన్ 11వ తేదీలోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం ప్రకటించాలని డిమాండ్
  • కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని మంద కృష్ణ ఆగ్రహం
  • ఆరు నెలలు కావొస్తున్నా రిజర్వేషన్ల పెంపు గురించి మాట్లాడటం లేదని విమర్శ
రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జూన్ 11వ తేదీలోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని గడువు విధించారు. లేదంటే అందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని విమర్శించారు.

కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందనడానికి రిజర్వేషన్ పెంపుదలపై నిర్లక్ష్యమే నిదర్శనమన్నారు. ఆయా వర్గాలను నమ్మించేందుకు అదే వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేను తీసుకువచ్చి రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై డిక్లరేషన్ కూడా చేశారన్నారు. అలాగే బీసీ నేత సిద్ధరామయ్యను తీసుకువచ్చి కామారెడ్డిలో డిక్లరేషన్ చేయించారని తెలిపారు.

కానీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావొస్తున్నా రిజర్వేషన్ల పెంపు గురించి మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం మాయమాటలు చెప్పి ఆయా వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచకుంటే నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
Manda Krishna Madiga
MRPS
Revanth Reddy
Congress

More Telugu News