Pakistan: పాకిస్థాన్ లో అదుపుతప్పి లోయలో పడ్డ‌ బస్సు.. 28 మంది మృత్యువాత‌!

At least 28 killed after bus falls into ravine in Pakistan
  • బలూచిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున దుర్ఘ‌ట‌న‌
  • డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌న్న‌ స్థానిక మీడియా 
  • ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్ర‌ధాని షెహబాజ్‌ షరీఫ్‌
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది మృతిచెందారు. వివ‌రాల్లోకి వెళ్తే.. బలూచిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 54 మంది ప్రయాణికులతో బస్సు దక్షిణ బలూచిస్థాన్‌లోని టర్బాట్‌ నగరం నుంచి ఉత్తరాన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బ‌య‌ల్దేరింది. ఈ క్రమంలో కొండ ప్రాంతంలో మలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ సహా మొత్తం 28 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 మంది వ‌ర‌కు ప్రయాణికుల‌కు గాయాల‌య్యాయి.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలికాప్టర్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది. మరోవైపు ఈ ఘటనపై ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Pakistan
Road Accident
Balochistan

More Telugu News