Diagnostics Center: స్కానింగ్ సెంటర్ వ్యవహారంపై నిజామాబాద్ కలెక్టర్ సీరియస్.. విచారణకు ఆదేశం

Nizamabad Collector Forms Enquiry Committee on Ayyappa Daignostics Issue
  • నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు
  • వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • కమిటీ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి
స్కానింగ్ సెంటర్ లో మహిళను స్పై కెమెరాతో రికార్డు చేస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన వ్యవహారంపై నిజామాబాద్ కలెక్టర్ సీరియస్ గా స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు నలుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. వారం లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు వివరించారు. 

నిజామాబాద్ పట్టణంలోని అయ్యప్ప డయాగ్నోస్టిక్స్ సెంటర్ లో టెస్టుల కోసం వచ్చిన మహిళలను నగ్నంగా మార్చి స్పై కెమెరాలతో రికార్డు చేసినట్లు బయటపడడం సంచలనం సృష్టించింది. చెస్ట్ స్కానింగ్ కోసమని వెళ్లిన తనను అయ్యప్ప డయాగ్నోస్టిక్స్ సెంటర్ అసిస్టెంట్ దుస్తులు విప్పించాడని, ఆపై రహస్యంగా రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డయాగ్నోస్టిక్స్ ఆపరేటర్ నిర్వాకాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ ఆదేశాలతో ఇప్పటికే దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు.. ఈ వ్యవహారంలో ఆపరేటర్ ఒక్కడే ఉన్నాడా లేక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 

కమిటీ వేసిన కలెక్టర్..
డయాగ్నోస్టిక్స్ సెంటర్ అకృత్యాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ నలుగురు వైద్యాధికారులతో కలెక్టర్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో, జిల్లా జనరల్ ఆసుపత్రి రేడియాలాజిస్ట్ డాక్టర్ శ్రావణి, డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ అంజనాదేవి, గైనకాలజిస్టులు డాక్టర్ అనుపమ, డాక్టర్ లావణ్య ఉన్నారు.

ఏంజరిగిందంటే.. 
నిజామాబాద్ లోని అయ్యప్ప స్కా నింగ్ సెంటర్ లో పనిచేస్తున్న ఓ ఆపరేటర్ మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డాడు. స్కానింగ్ కోసం వచ్చిన మహిళలను అవసరంలేకున్నా దుస్తులు విప్పించి స్కానింగ్ చేసేవాడు. ఇదంతా రహస్యంగా అమర్చిన కెమెరాలతో చిత్రీకరించేవాడు. రిజిస్టర్ లో రాసిన ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సాప్ లో అసభ్యంగా చాట్ చేసేవాడు. నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్నాయని భయపెడుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పదుల సంఖ్యలో మహిళలను ఇలాగే వేధింపులకు గురిచేశాడు. కొంతకాలంగా సాగుతున్న ఈ వ్యవహారం ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది.
Diagnostics Center
Spy Recording
Women Patients
Nizamabad District

More Telugu News