Delhi Metro Rail: ఢిల్లీ మెట్రో రైలు రూఫ్ పై స్వల్ప మంటలు.. వీడియో వైరల్

Delhi Metro On Viral Video Of Fire In Train Coach Case Of Pantograph Flashing
  • స్పందించిన ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్
  • తీగలు, విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించే పరికరం మధ్య ఏదో చిక్కుకోవడం వల్లే మంటలు వచ్చినట్లు వివరణ
  • ఐదు నిమిషాల తనిఖీల అనంతరం రైలు యథావిధిగా గమ్యస్థానానికి బయలుదేరిందని వెల్లడి
ఢిల్లీ మెట్రో రైలు రూఫ్ పై స్వల్ప స్థాయిలో మంటలు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైషాలి ప్రాంతానికి వెళ్లే మెట్రో రైలు సోమవారం సాయంత్రం రాజీవ్ చౌక్ స్టేషన్ లో ఆగినప్పుడు దాని రూఫ్ పై స్వల్పంగా మంటలు కనిపించాయి. దీంతో ప్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. ఈ ఘటన ప్రమాదకరమైనదేమీ కాదని వివరణ ఇచ్చింది. రైలు రూఫ్ పై వేలాడే విద్యుత్ తీగలు, దాన్నుంచి విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించేందుకు ఉండే ఇనుప కడ్డీల పరికరం (పాంటోగ్రాఫ్) మధ్య ఏదైనా చిక్కుకుపోవడమో లేదా ఇరుక్కుపోవడమో జరిగినప్పుడు స్వల్ప మంట వస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. దీనివల్ల ఎటువంటి భద్రతా ముప్పు లేదా ప్రయాణికులకు ప్రాణాపాయం ఉండదని వెల్లడించింది. అయితే ఇందుకు గల కారణంపై దర్యాప్తు చేపడతామని తెలిపింది.

దెబ్బతిన్న పాంటోగ్రాఫ్ తిరిగి విద్యుత్ గ్రహించకుండా నిలిపివేశామని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ చెప్పింది. కేవలం ఐదు నిమిషాల తనిఖీల అనంతరం మిగిలిన పాంటోగ్రాఫ్ లతోనే రైలు గమ్యస్థానానికి బయలుదేరిందని తెలిపింది.

2002లో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులు ఢిల్లీవాసులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఢిల్లీ మెట్రో నెట్ వర్క్ మొత్తం 392.44 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్ సీఆర్)లో 288 స్టేషన్లు ఉన్నాయి. ఏటా సుమారు 70 కోట్ల మంది ప్రయాణికులను ఢిల్లీ మెట్రో గమ్యస్థానాలకు చేరుస్తోంది.
Delhi Metro Rail
Fire
Coach
Roof
Pantograph

More Telugu News