Royal Challengers Bengaluru: ఆరెంజ్ క్యాప్ తో ఐపీఎల్ గెలవలేరు.. కోహ్లీపై అంబడి రాయుడు సెటైర్

Virat Kohli Puts Pressure Orange Cap Doesnt Win You IPL Ambati Rayudu Lambasts RCB
  • తన ఆటతీరుతో జట్టు ఆటగాళ్లపై విరాట్ ఒత్తిడి కలిగిస్తున్నాడని వ్యాఖ్య
  • కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో చిట్ చాట్
  • ఆర్సీబీ యాజమాన్యం ఆటగాళ్ల వ్యక్తిగత మైలురాళ్లకే ప్రాధాన్యం ఇస్తుందంటూ కొన్ని రోజుల కిందట కామెంట్
ఐపీఎల్ 2024 టైటిల్ ను కోల్ కతా నైట్ రైడర్స్ గెలుచుకున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు మరోసారి నోరుపారేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ తో ఎవరూ టైటిల్ గెలవలేరంటూ పరోక్షంగా విరాట్ కోహ్లీని ఉద్దేశించి సెటైర్ వేశాడు. జట్టులోని ఆటగాళ్లందరూ బాగా ఆడితేనే టైటిల్ లభిస్తుందంటూ కామెంట్ చేశాడు. ఈ సీజన్ లో 700కుపైగా పరుగులు సాధించిన కోహ్లీ అత్యధిక పరుగులు చేసే ఆటగాళ్లకు అందించే ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అయితే కోహ్లీ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అప్పటి నుంచి ఆర్సీబీపై ట్రోలింగ్ కు దిగుతున్న అంబటి రాయుడు తాజాగా మళ్లీ ఆ జట్టును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.

‘కేకేఆర్ జట్టుకు శుభాకాంక్షలు. సునీల్ నరైన్, రస్సెల్, మిచెల్ స్టార్క్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ముందుండి జట్టును నడిపించారు. జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఐపీఎల్ ను గెలిచే జట్టు తీరు ఇది. కొన్నేళ్లుగా మనం దీన్ని చూస్తున్నాం. కేవలం ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ టైటిల్ తెచ్చి పెట్టదు. ఒక్కొక్కరూ 300 పరుగులకుపైగా చేసిన ఆటగాళ్ల భాగస్వామ్యమే ఐపీఎల్ ట్రోఫీని అందించింది’ అంటూ స్టార్ స్పోర్ట్స్ చానల్ తో చిట్ చాట్ లో చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ ఒక దిగ్గజం, లెజెండ్. అతను ఆటలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పుతాడు. ఇది ఆర్సీబీ జట్టులోని ఇతర ఆటగాళ్లపై అతనిలాగా  ఆడాలనే ఒత్తిడి కలిగిస్తోంది. అందుకే కోహ్లీ తన ప్రమాణాలను కాస్త తగ్గించుకోవాలి. అప్పుడు డ్రెస్సింగ్ రూంలో యువ ఆటగాళ్ల మనసు దారితప్పదు’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు.

కొన్ని రోజుల కిందట కూడా ఆర్సీబీ జట్టును ఎగతాళి చేసేలా అంబటి రాయుడు మాట్లాడాడు. ఆర్సీబీ యాజమాన్యం జట్టు టైటిళ్లు గెలవడంకన్నా ఆటగాళ్ల వ్యక్తిగత మైలురాళ్లకే ప్రాధాన్యం ఇస్తుందని విమర్శించాడు. అందుకే గత 17 సీజన్లలో ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదని చెప్పుకొచ్చాడు.

‘ఏళ్ల తరబడి ఆర్సీబీకి మద్దతిస్తున్న అభిమానులను చూస్తే నా మనసు ఎంతో బాధపడుతుంది. ఆ జట్టు యాజమాన్యం, నాయకులు వ్యక్తిగత మైలురాళ్లకన్నా జట్టు ప్రయోజనాలను ముందు పెట్టి ఉంటే ఈపాటికి ఆర్సీబీ ఎన్నో టైటిళ్లు గెలిచేది. కానీ ఎందరో దిగ్గజ ఆటగాళ్లను ఆ జట్టు వదులుకుంది. అందుకే జట్టు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లను ఆర్సీబీ యాజమాన్యం తీసుకొచ్చేలా వారిపై ఒత్తిడి తీసుకురండి. అప్పుడు ఆటగాళ్ల వేలంపాటలో కొత్త అధ్యాయం మొదలవుతుంది’ అంటూ ఆర్సీబీ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా అంబటి రాయుడు ఇటీవల ఓ ఉచిత సలహా ఇచ్చాడు.
Royal Challengers Bengaluru
Virat Kohli
Ambati Rayudu
IPL 2024
Title
Winner
Star Sports
Orange Cap

More Telugu News