Anwarul Azim Anar: బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌ వచ్చిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్ మృతి

Kolkata Police Recovered the Body of Bangladesh MP Anwarul Azim Anar
  • వైద్యం కోసం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌
  • కొన్ని రోజుల క్రితం స్నేహితుడి ఇంట్లో నుంచి అదృశ్యం
  • వారం రోజులుగా ఆయ‌న‌ కోసం బెంగాల్‌ పోలీసులు, బంగ్లాదేశ్‌ అధికారుల‌ గాలింపు
  • కోల్‌క‌తాలో ఇవాళ ఎంపీ మృత‌దేహం ల‌భ్యం
  • ఎవ‌రైనా హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసుల అనుమానం
వైద్యం కోసం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ కొన్ని రోజుల క్రితం అదృశ్యమయ్యారు. ఆయన మృతి చెందినట్లు బుధ‌వారం ఆయన వ్యక్తిగత కార్యదర్శి అబ్దుర్ రవూఫ్ తెలిపారు. కోల్‌కతా ప‌రిధిలోని న్యూటౌన్‌లోని ఓ ఖాళీ ఇంట్లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాగా, గ‌డిచిన వారం రోజులుగా బెంగాల్‌ పోలీసులు, బంగ్లాదేశ్‌ అధికారులు అన్వరుల్‌ అజీమ్‌ కోసం గాలించ‌డం జ‌రిగింది. చివ‌రికి ఆయ‌న శవంగా క‌నిపించారు. దీంతో ఆయ‌న‌ను ఎవ‌రైనా హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.  

వివ‌రాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్‌ అధికార పార్టీ అవామీ లీగ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్ ప్ర‌స్తుతం జెనైదా-4 నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఆయ‌న‌ చికిత్స నిమిత్తం పశ్చిమ బెంగాల్‌ వచ్చి.. మే 12న కోల్ కతా, బారానగర్‌లోని తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్‌ ఇంట్లో బస చేశారు. రెండు రోజుల తర్వాత వెంటనే వచ్చేస్తానని చెప్పి, ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో స్నేహితుడితో పాటు బంగ్లాదేశ్‌లోని ఎంపీ కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్లు చేశారు. కానీ, ఎవరి కాల్స్‌కు ఆయన సమాధానం ఇవ్వలేదు. 

ఈ క్ర‌మంలో మే 14వ తేదీ నుంచి ఆయన ఫోన్‌ స్విచ్ఛాప్ అయిన‌ట్లు బిశ్వాస్‌ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తుండగా.. బుధ‌వారం ఆయన మృతదేహం లభ్యమైంది. ఇక అన్వరుల్‌ అజీమ్ మొబైల్‌లో భార‌త్‌, బంగ్లాకు చెందిన రెండు సిమ్ కార్డులు ఉన్నాయి. ఆ రెండు నంబ‌ర్లు ప‌ని చేయ‌‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ను గుర్తించడం ఆల‌స్య‌మైన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.
Anwarul Azim Anar
Bangladesh
Kolkata
India

More Telugu News