Bride Kidnapped: ఊరేగింపులో వధూవరులు.. ఆయుధాలతో అడ్డగించి నవ వధువును ఎత్తుకుపోయిన దుండగులు

 Newlywed woman kidnapped by bike borne men in Dahod
  • గుజరాత్‌లోని దహోద్ జిల్లాలో ఘటన
  • ఊరేగింపును అడ్డుకున్న 15 మంది సాయుధులు
  • ఇప్పటి వరకు ఐదుగురి అరెస్ట్
  • నవ వధువును తీసుకుని మధ్యప్రదేశ్‌కు ప్రధాన నిందితుడు
పెళ్లి ఊరేగింపును అడ్డగించిన దుండగులు కారులో ఉన్న నవ వధువును ఎత్తుకెళ్లిన ఘటన గుజరాత్‌లోని దహోద్‌ జిల్లాలో జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కొందరిని అదుపులోకి తీసుకున్నా వధువు ఆచూకీ మాత్రం లభించలేదు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి వివాహం అనంతరం వధూవరులను ఊరేగించారు. ఊరేగింపు నవగామ్‌కు చేరుకోగానే సాయుధులైన 15 మంది దుండగులు వధూవరులు ఉన్న కారును అడ్డుకున్నారు. ఆపై నవ వధువు ఉష (22)ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. 

ఆ వెంటనే వరుడు రోహిత్ అమలియార్ (23) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నా‌ప్ సూత్రధారులంటూ ఐదుగురు పేర్లు చెప్పిన రోహిత్, మరో 10 మంది కూడా కిడ్నాప్‌లో పాల్గొన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 మంది నిందితులను గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

కిడ్నాప్ వ్యవహారంలో మహేశ్ భూరియాను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్టు దహోద్ డివిజన్ డీఎస్పీ జగదీశ్‌సింగ్ భండారీ తెలిపారు. నవ వధువు ఉష, నిందితులు దూరపు బంధువులని పేర్కొన్నారు. మహేశ్ కజిన్ ఒకరు ఉష కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఉషను కిడ్నాప్ చేసిన నిందితుడు మధ్యప్రదేశ్ వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. అక్కడి పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
Bride Kidnapped
Gujarat
Dahod
Crime News

More Telugu News