KTR: ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన: కేటీఆర్

ktr slams congress govt decision on 500 bonus only for fine grain paddy
  • సన్న రకం వడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ 
  • పార్లమెంట్ ఎన్నికలయ్యాక కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపెట్టిందంటూ ధ్వజం
  • తమ గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరని వ్యాఖ్య
  • పల్లెపల్లెనా ప్రశ్నిస్తారని.. తెలంగాణవ్యాప్తంగా నిలదీస్తారన్న కేటీఆర్
కేవలం సన్న వడ్లకు మాత్రమే రూ. 500 బోనస్ ప్రకటిస్తామంటూ కేబినెట్ భేటీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు రైతులను బోనస్ పేరుతో నమ్మించి వారి ఓట్లు పొందాక ఇప్పుడు కేవలం సన్న వడ్లకే బోనస్ ప్రకటించడం నయవంచనకు పాల్పడటమేనని విమర్శించారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

అప్పుడు హామీ ఇచ్చి..
‘వరి పంటకు రూ. 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా ? ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ??
ఇది ప్రజా పాలన కాదు. రైతు వ్యతిరేక పాలన. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా అని ప్రకటించి ఇప్పటికీ ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ. 12,000 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ఇంకా వేయలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే రూ. 2 లక్షల రుణమాఫీ చెప్పి చేయలేదు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు’ అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

నిజస్వరూపం బయటపడింది..
‘ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం. అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే 4 కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ సర్కారు. ఎద్దేడ్సిన యవుసం. రైతేడ్చిన రాజ్యం నిలబడదు. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు. పల్లెపల్లెనా ప్రశ్నిస్తారు.. తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు. కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ’ అంటూ కేటీఆర్ ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. జై కిసాన్, జై తెలంగాణ అంటూ పోస్ట్ ను ముగించారు.
KTR
Congress Government
Telangana
Paddy Bonus
Rs500
Fine grain Paddy

More Telugu News